తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలవరం ప్రాజెక్టు ముంపుపై తక్షణమే సర్వే చేపట్టాలి: సీడబ్ల్యూసీ - Polavaram project latest news

CWC Meeting on Polavaram Project: పోలవరంపై కేంద్ర జలసంఘం సమావేశం నిర్వహించింది. సీడబ్ల్యూసీ ఛైర్మన్ కుష్విందర్ వోరా అధ్యక్షతన దిల్లీలో భేటీ అయ్యారు. పోలవరం ముంపుపై సర్వేను ఏపీ తాత్సారం చేస్తోందని తెలంగాణ పేర్కొంది. సీడబ్ల్యూసీ ఆదేశాలున్నా.. సర్వేకు ఆంధ్రప్రదేశ్​ ముందుకు రాలేదని వివరించింది. వర్షాకాలం దృష్ట్యా సంయుక్త సర్వేకు చర్యలు చేపట్టాలని తెలంగాణ కోరింది.

polavaram
polavaram

By

Published : Apr 3, 2023, 10:37 PM IST

CWC Meeting on Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ముంపుపై తక్షణమే సర్వే చేపట్టాలని ప్రాజెక్టు అథారిటీ.. ఏపీ ప్రభుత్వానికి కేంద్ర జలసంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలంగాణ నీటిపారుదల శాఖ తెలిపింది. తెలంగాణ ఒత్తిడి నేపథ్యంలో ముంపుపై అధ్యయనం కోసం నియమిత కాలపరిమితిని విధించినట్లు పేర్కొంది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ముంపు, ఇతర అనేక సాంకేతిక అంశాలపై సీడబ్ల్యూసీ దిల్లీలో సమావేశం నిర్వహించింది.

కేంద్ర జలసంఘం ఛైర్మన్‌ కుష్విందర్‌ వోరా అధ్యక్షతన జరిగిన సమావేశంలో.. తెలంగాణ నుంచి ఈఎన్సీ నాగేంద్రరావు, కొత్తగూడెం సీఈ శ్రీనివాస్‌రెడ్డి, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, అంతర్ రాష్ట్ర బోర్డు గోదావరి డైరెక్టర్‌ సుబ్రమ్మణ్య పసాద్‌, ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకర్‌ బాబు.. ఒడిశా నుంచి ఈఎన్సీ అశుతోష్‌దాస్‌, ఛత్తీస్​గడ్ సీఈ నగరియా, సీడబ్ల్యూసీ, పీపీఏ అధికారులు పాల్గొన్నారు.

తెలంగాణ తరఫున ఇంజనీర్లు మరోమారు వాదనలను బలంగా వినిపించారు. పోలవరం ప్రాజెక్టు ముంపుపై సర్వే నిర్వహణను ఏపీ తాత్సారం చేస్తుండడాన్ని తీవ్రంగా నిరసించిన తెలంగాణ.. సీడబ్ల్యూసీ గతంలో ఆదేశాలు జారీ చేసినా ఆంధ్రప్రదేశ్ అసంబద్ధ వాదనలతో సర్వేకు ముందుకు రాలేదని తప్పుపట్టింది. పోలవరం ఎఫ్‌ఆర్‌ఎల్‌ నీటిని నిల్వ చేసినప్పుడు.. తెలంగాణ భూభాగంలో ఏర్పడుతున్న ముంపును గుర్తించాలని పేర్కొంది. డ్రైనేజీ, స్థానిక ప్రవాహాలు నిలచిపోవడం వల్ల వాటిల్లే ప్రభావాలు.. జూలై 2022 వరదలపై తాజాగా ఉమ్మడి అధ్యయనం చేపట్టాలని కోరింది.

స్థానిక ప్రవాహాలపై కూడా సర్వే చేయాలి: మణుగూరు భారజల కేంద్రం, చారిత్రక భద్రాద్రి ఆలయం రక్షణకు చర్యలు చేపట్టాలని కోరిన తెలంగాణ.. కొత్తగా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని తెలిపింది. భద్రాచలం పట్టణంలో 8 అవుట్‌ ఫాల్‌ రెగ్యులేటర్‌ల స్థాయిలను ధృవీకరించాలని పేర్కొంది. పోలవరం ప్రాజెక్టు కారణంగా కిన్నెరసాని, ముర్రేడువాగు నదుల నీటి పారుదల రద్దీకి సంబంధించి.. ఎన్జీటీ ఉత్తర్వులను అనుసరించి వాటితో పాటు ఇతర పెద్ద స్థానిక ప్రవాహాలపై కూడా సర్వే చేయాలని కోరింది.

సత్వరమే చర్యలు ప్రారంభించాలి: రాబోయే వర్షాకాలం దృష్ట్యా ఇంకా ఆలస్యం చేయకుండా.. సంయుక్త సర్వేకు సత్వరమే చర్యలు ప్రారంభించాలని తెలంగాణ డిమాండ్ చేసింది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం తరహాలో ఏదైనా ఏజెన్సీతో.. పీపీఏ ఆధ్వర్యంలో తక్షణమే సర్వే చేపట్టాలని తెలిపింది. పూడిక ప్రభావంతో సహా నది క్రాస్‌-సెక్షన్లను కొత్తగా తీసుకుని ముంపును అంచనా వేయాలని కోరింది. పోలవరం ప్రాజెక్ట్‌ కారణంగా జూలై 2022న తెలంగాణలో వచ్చిన వరదల ప్రభావాన్ని సీడబ్ల్యూసీ అంగీకరించడం లేదని పేర్కొంది. బచావత్‌ ట్రైబ్యునల్‌ అవార్డ్‌ ఆపరేషన్‌ షెడ్యూల్‌ నిబంధనలకు కట్టుబడి.. ప్రాజెక్ట్‌ పూర్తైన తర్వాత ఆ ప్రభావం ఉండదని వాదిస్తోందని అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఈ చర్యలన్ని చాలా అవసరం: అయితే పోలవరం బ్యాక్‌ వాటర్‌ వల్ల వరద ప్రభావం ఉంటుందన్న తెలంగాణ.. సంయుక్త సర్వే తర్వాత పుణేలోని సీడబ్ల్యుపీఆర్‌ఎస్‌, ఇతర నిపుణులతో వీలైనంత త్వరగా సంబంధిత మోడల్‌ అధ్యయనాలను చేయించాలని కోరింది. సుప్రీంకోర్టు నిర్దేశించిన విధంగా రాష్ట్రాల సమస్యలు, ఆందోళను పరిష్కరించాలంటే ఈ చర్యలన్నీ చాలా అవసరమని పేర్కొంది. అప్పటివరకు ఆంధ్రపదేశ్‌ ప్రభత్వం పోలవరం ప్రాజెక్ట్‌లో నీటిని నిల్వచేయడం, జలాశయాన్ని నిర్వహించడం ఎట్టిపరిస్థితుల్లోనూ చేపట్టరాదని డిమాండ్ చేసింది.

నియమిత కాలపరిమితి విధిస్తూ: తమ ఒత్తిడి, నిరసనతో ఉమ్మడి సర్వే పూర్తికి నియమిత కాలపరిమితి విధిస్తూ.. పోలవరం ప్రాజెక్టు అథారిటీకి కేంద్ర జలసంఘం అల్టిమేటం జారీ చేసిందని తెలంగాణ తెలిపింది. ఏప్రిల్‌ పదో తేదీన తెలంగాణ, ఏపీతో సమావేశం నిర్వహించాలని పీపీఏను ఆదేశించినట్లు పేర్కొంది. ముంపుపై ఇరు రాష్ట్రాలు గతంలో చేసిన అధ్యయనాలు, రూపొందించిన మ్యాపులపై చర్చించాలని.. తదననంతరం ఉమ్మడి సర్వే సత్వరమే చేపట్టాలని నొక్కిచెప్పిందని తెలంగాణ స్పష్టం చేసింది.

ఒడిశా, చత్తీస్​గఢ్​ రాష్ట్రాలు సైతం పలు డిమాండ్లను సీడబ్ల్యూసీకి నివేదించినట్లు తెలంగాణ వివరించింది. ముంపునకు సంబంధించి గోపాలకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికను ఎట్టిపరిస్థితులోనూ అంగీకరించేది లేదని.. కొత్తగా అధ్యయనం చేసి సర్వే, ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని డిమాండ్‌ చేసినట్లు వెల్లడించింది.

ఇవీ చదవండి:తుది నివేదిక అందించడానికి మరికొంత సమయం అవసరం: పోలవరం ముంపుపై సుప్రీంకు కేంద్రం లేఖ

TSPSC ఛైర్మన్ వాంగ్మూలం రికార్డు... ముగ్గురు నిందితులకు కస్టడీ

హనుమాన్ జయంతి స్పెషల్​.. నైవేద్యంగా టన్ను బరువున్న లడ్డూ.. ఎక్కడంటే?

ABOUT THE AUTHOR

...view details