Heat stroke across India : దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు, వడగాలులు జనాల్ని బెంబేలెత్తిస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు రాక ఆలస్యం కావడంతో ఎండలు దంచి కొడుతున్నాయి. దేశవ్యాప్తంగా పెరిగిన ఉష్ణోగ్రతలు, వడగాలుల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర ప్రభుత్వం ఏడు రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు, విపత్తు నిర్వహణ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు, హెల్త్ సెక్రెటరీ రిజ్వి, కుటుంబ ఆరోగ్య సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేత మహంతి పాల్గొన్నారు.
తెలంగాణలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ముందస్తుగా అప్రమత్తమై ప్రజారోగ్య సంరక్షణ కోసం ద్విముఖ వ్యూహం అనుసరించిందని కేంద్రానికి మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మార్చి మొదటి వారంలోనే అన్ని స్థాయిల్లోని ఆరోగ్య సిబ్బందికి వడదెబ్బకు గురైన బాధితులకు సత్వర చికిత్సపై శిక్షణ ఇచ్చామన్నారు. పబ్లిక్ హెల్త్ రెస్పాన్స్, హాస్పిటల్ రెస్పాన్స్ వ్యవస్థలను సంసిద్ధం చేసి.. వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కలిగేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించామన్నారు.
పీహెచ్సీ స్థాయి నుంచి అన్ని ఆసుపత్రుల్లో అవసరమైన మందులు అందుబాటులో ఉంచడం సహా.. బస్టాండ్, రైల్వే స్టేషన్లు, భవన నిర్మాణ ప్రాంతాలు, ఉపాధి హామీ పనులు జరిగే ప్రాంతాల్లో నీడ, నీటి వసతి ఉండేలా చూశామని పేర్కొన్నారు. వడదెబ్బ బాధితుల కోసం ప్రత్యేకంగా వార్డులు, ఐసీయూ బెడ్స్‌తో పాటు.. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఐవి ఫ్లూయిడ్స్, ఓఆర్ఎస్ ఇతర మందులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.