పట్టుమని 15 రోజుల వ్యవధిలోనే వంట గ్యాస్ ధర మళ్లీ మండింది. గృహావసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండరు ధరను తాజాగా కేంద్రం రూ.25 పెంచింది. ఈ పెంపు బుధవారం నుంచి అమలులోకి వచ్చింది. ఈ క్రమంలో 14.2 కిలోల వంటగ్యాస్ సిలిండర్ ధర హైదరాబాద్‌లో రూ.937కు చేరింది. గత నెల 17వ తేదీన గ్యాస్ బండపై రూ.25 పెంచిన కేంద్రం.. పక్షం రోజుల్లోనే మళ్లీ మరో రూ.25 పెంచటం విమర్శలకు తావిస్తోంది. సిలిండరు ధరను ఇష్టారాజ్యంగా బాదుతున్న కేంద్ర ప్రభుత్వం వినియోగదారులకు ఇచ్చే సబ్సిడీని మాత్రం సుమారు ఏడాదిగా పెంచటం లేదు. మరోవంక.. వాణిజ్యావసరాలకు వినియోగించే 19 కిలోల సిలిండరు ధరను గత నెలలో రూ.5 మేర తగ్గించిన చమురు సంస్థలు.. తాజాగా బుధవారం నుంచి రూ.74 పెంచాయి.
తెలంగాణలో 1.10 కోట్ల గృహావసరాల వంటగ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. సగటున ప్రతి నెలా సుమారు 60 శాతం సిలిండర్లు పంపిణీ అవుతున్నాయి. ఈ ప్రకారం.. గ్యాస్‌బండపై ఒకసారి రూ.25 వడ్డిస్తే ప్రజలపై పడే భారం రూ.16.50 కోట్ల వరకూ ఉంటోంది. రాష్ట్రం అంతటా సిలిండర్ ధర ఒకేలా ఉండదు. దూరాన్ని పరిగణనలోకి తీసుకుని రవాణా ఛార్జీలను జోడించి చమురు సంస్థలు దాన్ని నిర్ణయిస్తాయి.