హైదరాబాద్ అవుటర్ రింగు రోడ్డు వెలుపల నిర్మించే ప్రాంతీయ రింగు రోడ్డు(Regional Ring Road Hyderabad) ఉత్తర భాగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు అలైన్‌మెంట్ రూపొందించినట్లు తెలిసింది. దీనిపై త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఈ రహదారిలో ఉత్తర భాగమైన సంగారెడ్డి- నర్సాపూర్- తూప్రాన్- గజ్వేల్- జగదేవ్‌పూర్- యాదాద్రి- భువనగిరి- చౌటుప్పల్ మార్గానికి కేంద్రం ‘ఎన్‌హెచ్ 166ఏఏ’ నంబరు కేటాయించిన విషయం తెలిసిందే. అలానే భారత్ పరియోజనమాల పథకంలో చేర్చింది. ఈ మార్గానికి తుది సవివర నివేదిక రూపొందించేందుకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ గత జూన్‌లో టెండర్లు ఆహ్వానించింది. మహారాష్ట్రకు చెందిన కె అండ్ జె ప్రాజెక్ట్స్ ఎంపికైంది. ఈ సంస్థ ఉత్తర భాగాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి 3 ప్రతిపాదనలతో నివేదిక అందజేసింది. కేంద్రం వీటిని పరిశీలించి ఒక మార్గాన్ని ఎంపిక చేసింది. దాని పొడవు సుమారు 158 కిలోమీటర్లు. ఆ ప్రతిపాదనను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతస్థాయిలో అధ్యయనం చేసి కేంద్రానికి సూత్రప్రాయ ఆమోదం తెలిపినట్లు సమాచారం.
గజ్వేల్-యాదాద్రి మధ్య మార్పులు
ప్రాంతీయ రింగురోడ్డు నిర్మాణంలో మార్పులు చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో లేఖ రాశారు. గజ్వేల్-యాదాద్రి మధ్య వివిధ అభివృద్ధి పథకాల్లో భాగంగా చేపట్టిన పనుల నేపథ్యంలో గతంలో రూపొందించిన ప్రాంతీయ రింగురోడ్డు అమరిక(ఎలైన్‌మెంట్)లో మార్పులు చేయాలని కోరారు. గత ఎలైన్‌మెంట్‌కు గజ్వేల్ రింగురోడ్డు అత్యంత సమీపంగా ఉంటుంది. అక్కడ మార్పులు చేయాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా యాదాద్రి సమీపంలో బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మించారు. ఆ మార్గంలోనూ మార్పులు చేయాలని కోరారు. ఆ రెండు ప్రాంతాల్లో కేసీఆర్ సూచనలను పరిగణిస్తూ అమరికను రూపొందించినట్లు సమాచారం.