Author Sujatha Reddy Launched 'Katha 2021' Book: ‘జీవితానికి... కథకు పెద్దగా తేడా ఉండదు. సమాజాన్ని, జాతి సంస్కృతిని, జీవన విధానాన్ని, మన మూలాల్ని తెలియజేసేది, ముందు తరాలకు అందించేదే సాహిత్యం’ అని ‘కథ 2021’ ఆవిష్కరణ సభలో వక్తలు ఉద్ఘాటించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఆర్థిక సహకారంతో.. కథాసాహితీ 1990 నుంచి ఉత్తమ కథలను పాఠకులకు అందిస్తోంది. ఆ సంకలనాల పరంపరలో భాగంగా 32వ ‘కథ-2021’ ఆవిష్కరణ సభ శనివారం హైదరాబాద్‌లో జరిగింది.
బొగ్గులకుంట తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అరసం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు. రచయిత్రి డా.ముదిగంటి సుజాతారెడ్డి ‘కథ 2021’ని ఆవిష్కరించారు. ముఖ్యఅతిథి, తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి మాట్లాడుతూ.. దాదాపు రెండు దశాబ్దాలకుపైగా వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్ చేస్తున్న సాహిత్య సేవలో ‘తానా’కు అవకాశం కల్పించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు.