CBI letter to CS on MLA poaching case: ఎమ్మెల్యేలకు ఎర కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ వివరాలను ఇవ్వాలని సీబీఐ అధికారులు మరోసారి సీఎస్‌కు లేఖ రాశారు. ఈ నెల 6వ తేదీన రాసిన లేఖలో మెయినాబాద్ పీఎస్‌లో నమోదైన ఎఫ్ఐఆర్ వివరాలు ఇవ్వాలని కోరారు. హైకోర్టు ధర్మాసనం తీర్పు వెలువడిన తర్వాత సీబీఐకి చెందిన ఢిల్లీ ఎస్పీ సుమన్ కుమార్ ఈ లేఖ రాశారు. ఇదివరకు సీబీఐ 5సార్లు సీఎస్‌కు లేఖ రాశారు.
సిట్ దర్యాప్తును నిలిపేస్తూ, కేసును సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి గత డిసెబంర్ 26న తీర్పు ఇచ్చారు. తీర్పునకు సంబంధించిన ప్రతులు 28వ తేదీన బయటకు వచ్చాయి. ఆ ప్రతులు ఢిల్లీలోని సీబీఐ కార్యాలయానికి చేరుకున్న తర్వాత, అదే నెల డిసెబంర్ 31వ తేదీన సీఎస్ కు లేఖ రాశారు. మెయినాబాద్ పీఎస్‌లో నమోదైన ఎఫ్ఐఆర్ వివరాలు హైకోర్టు తీర్పునకు అనుగుణంగా ఇవ్వాలని లేఖలో కోరారు.