Chikoti Praveen Car theft : క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్ కారును గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారట. తన కారు చోరీకి గురైందని ఆయనే స్వయంగా సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొంతమంది దుండగులు గతవారం రోజులుగా తన ఇంటి రెక్కీ నిర్వహిస్తున్నట్లు ప్రవీణ్ తెలిపారు. తన కారు చోరీ అయిన తర్వాత సీసీటీవీ దృశ్యాలు పరిశీలిస్తే రెక్కీ నిర్వహించిన వారే ఎత్తుకెళ్లినట్లు తేలిందని పోలీసులకు వివరించారు. గతంలో కూడా పలుమార్లు అనుమానాస్పద యువకులు తన ఇంటి వద్ద రెక్కీ నిర్వహించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశానని చీకోటి వెల్లడించారు.
Chikoti Praveen Car theft case : ఈనెల 20న తెల్లవారుజామున దుండగులు తన ఇంటి వద్ద రెక్కీ నిర్వహించి కారు చోరీ చేశారని ప్రవీణ్ తెలిపారు. ఇన్నోవా క్రిస్ట్ టీఎస్11ఈక్యూ0444 గల వాహనాన్ని దుండగులు ఎత్తుకెళ్లారని పోలీసులకు వివరించారు. వెంటనే కారు చోరి చేసిన వ్యక్తులను అరెస్ట్ చేయాలని కోరారు. అర్ధరాత్రి సమయంలో తన ఇంట్లోకి ప్రవేశించే క్రమంలో విఫలమైన దుండగులు అతని అపార్ట్మెంట్ పార్కింగ్‌లో ఉన్న కారును ఎత్తుకెళ్లారని చీకోటి ప్రవీణ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని.. సైదాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు.. దుండగుల కోసం గాలింపు మొదలుపెట్టారు.