Case on Rajasingh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తెలంగాణ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయనపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఆదేశాలు జారీచేసింది.
ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో యోగికి ఓటు వేయకుంటే బుల్డోజర్లను ఎదుర్కోవాల్సి వస్తుందని ఓటర్లను ఉద్దేశిస్తూ రాజాసింగ్ వీడియోను విడుదల చేశారు. ఎన్నికల తరువాత వారిని గుర్తిస్తామని... బుల్డోజర్లు ఎందుకు వాడతారో తెలుసుగా అంటూ వీడియోలో హెచ్చరించారు. ఈ విషయంపై రాజాసింగ్ వివరణ ఇవ్వాలని ఇటీవల ఈసీ నోటీసులు ఇచ్చింది. ఈనెల 19వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటలోగా సమాధానమివ్వాలని రాజాసింగ్‌కు స్పష్టం చేసింది. గడువులోగా సమాధానం రాకపోవడం వల్ల తెలంగాణ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మంగళ్‌హాట్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.