పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులో పర్యావరణ అనుమతుల ఉల్లంఘనలపై దర్యాప్తు చేసేందుకు ఎన్జీటీ చెన్నై ధర్మాసనం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆగస్టు 27లోగా నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. ఈ ప్రాజెక్టులో పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారంటూ ఎన్జీటీలో కేసు నమోదైంది. ముదిరెడ్డిపల్లి నివాసి కోస్గి వెంకటయ్య ఈ పిటిషన్ దాఖలు చేశారు. ప్రాజెక్టు కోసం భారీగా చెరువులను తవ్వుతున్నారని పిటిషనర్ ఆరోపించారు.
ఏఏజీ వాదనలు
ప్రధానంగా ఉదండాపూర్ రిజర్వాయర్‌కు 16 కిలోమీటర్ల అడ్డుకట్ట నిర్మాణం కోసం తవ్వుతున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ అనుమతులు పాటించడం లేదని ట్రైబ్యునల్‌కు వివరించారు. అయితే ఈ కేసుకు విచారణ అర్హత లేదని అదనపు అడ్వకేట్ జనరల్ రాంచందర్‌రావు అన్నారు. 2016లో ప్రభుత్వం ప్రాజెక్టు కడితే కేసు ఇప్పుడు వేయడం విరుద్ధమని వాదించారు.
ఎన్జీటీ నోటీసులు
ఏఏజీ వాదనతో చెన్నై బెంచ్ విభేదించింది. పిటిషనర్ ప్రాజెక్టును సవాలు చేయడం లేదని... పర్యావరణ ఉల్లంఘనలపై మాత్రమే కేసు దాఖలు చేశారని వివరించింది. పిటిషన్‌ను స్వీకరించిన బెంచ్... పర్యావరణ నిబంధనల ఉల్లంఘనపై కేంద్ర పర్యావరణ శాఖ, తెలంగాణ సాగునీటి శాఖ, మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ఎస్ఈ, గనుల శాఖ, మహబూబ్ నగర్ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్లకు నోటీసులు జారీ చేసింది.
27లోగా నివేదిక
పర్యావరణ అనుమతులు ఉల్లంఘనలు జరిగాయో లేదో తేల్చేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులుగా కేంద్ర పర్యావరణ శాఖ ప్రాంతీయ కార్యాలయం సీనియర్ అధికారి, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి చెన్నై ప్రాంతీయ కార్యాలయం సైంటిస్ట్, మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్, నీరి సంస్థ ప్రతినిధి, గనులు, జియాలజీ శాఖ డైరెక్టర్లను ట్రైబ్యునల్ నియమించింది. ఉల్లంఘనలపై తనిఖీలు జరిపి ఆగస్టు 27లోగా నివేదిక ఇవ్వాలని కమిటీకి సూచించింది. తిరిగి అదే రోజు విచారణ జరుపుతామని తెలిపింది.
ఇదీ చదవండి:BANDI SANJAY: భాజపా పెట్టిన పొగతోనే ప్రజల్లోకి సీఎం కేసీఆర్