పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రకు కార్గో, పార్శిల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. రెండో దశ ఉద్ధృతిలో ఏపీలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అక్కడి ప్రభుత్వం కర్ఫ్యూను విధించింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పార్శిల్ సేవలను కొనసాగించడం కష్టమని ఏపీ ఏజెంట్లు స్పష్టం చేశారు. పరిస్థితులు చక్కదిద్దుకునే వరకు ఏపీకి పార్శిల్ సేవలు నిలిపివేస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక అధికారి కృష్ణకాంత్ తెలిపారు.
సాధ్యపడడంలేదని...
టీఎస్ఆర్టీసీ ఇప్పటికే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వీటి నుంచి బయటపడేందుకు కార్గో, పార్శిల్ సేవలను ప్రారంభించింది. అధికారుల లెక్కల ప్రకారం.. ప్రతి రోజు 14,000 పార్శిళ్లను ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు పంపుతున్నారు. వీటితో పాటు వివిధ కౌంటర్ల నుంచి రవాణా చేస్తారు. ఎంజీబీఎస్, జేబీఎస్ నుంచి కూడా ఏపీకి కార్గో, పార్శిల్ రవాణా చేసేవారు. కరోనా నేపథ్యంలో ఏపీలో ఉన్న ఏజెంట్లు పార్శిల్ సేవలు సాధ్యపడడంలేదని వెల్లడించడం వల్ల టీఎస్ఆర్టీసీ ఏపీకీ కార్గో, పార్శిల్ సేవలను నిలిపివేయాలని నిర్ణయించింది.
మూడు రాష్ట్రాల్లో..
ఏపీలో అన్ని జిల్లాలకు పార్శిల్ ఏజెంట్లు ఉన్నారు. వీరితో పాటు సబ్ ఏజెంట్లూ ఉన్నారు. అందరూ కలుపుకుని సుమారు 25 మంది వరకు ఏజెంట్లు ఏపీలో పనిచేస్తున్నారు. ఏపీతో పాటు పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలకు టీఎస్ఆర్టీసీ పార్శిల్ సేవలను అందిస్తోంది. ఈ మూడు రాష్ట్రాల్లో ప్రస్తుతం సేవలను కొనసాగించలేమని టీఎస్ఆర్టీసీ తెలిపింది.