తెలంగాణ

telangana

ETV Bharat / state

Campus Placements: ఇంజినీరింగ్ కాలేజీల్లో క్యాంపస్ ప్లేస్​మెంట్స్.. వారికే ఫస్ట్ ప్రిపరెన్స్!

గతంలో మాదిరిగా ఏమాత్రం హడావుడి లేకుండా ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రాంగణ నియామకాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. డిజిటల్‌ టెక్నాలజీలపై పట్టున్న విద్యార్థులను ఐటీ కంపెనీలు వార్షిక వేతనం ప్యాకేజీలు పెంచి మరీ ఎంపిక చేసుకునే పనిలో ఉన్నాయి.

placements
ఇంజినీరింగ్

By

Published : Sep 1, 2021, 10:45 AM IST

Updated : Sep 1, 2021, 2:03 PM IST

ఇంజినీరింగ్‌ కళాశాలల్లో గతంలో మాదిరిగా ఏమాత్రం హడావుడి లేకుండా ప్రాంగణ నియామకాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. డిజిటల్‌ టెక్నాలజీలపై పట్టున్న విద్యార్థులను ఐటీ కంపెనీలు వార్షిక వేతనం ప్యాకేజీలు పెంచి మరీ ఎంపిక చేసుకునే పనిలో ఉన్నాయి. రాత పరీక్ష నుంచి ముఖాముఖి వరకు అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతోంది. కరోనా కారణంగా అన్ని రంగాల సంస్థలు ఆటోమేషన్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడటంతో చిన్నచిన్న కంపెనీలు కూడా ప్రాజెక్టులు దక్కించుకుంటున్నాయి. ఫలితంగా ఆయా కంపెనీలు తాజా అభ్యర్థుల(ఫ్రెషర్స్‌)ను ఎక్కువగా నియమించుకుంటున్నాయని ప్రాంగణ నియామకాల అధికారులు చెబుతున్నారు.

ముగిసిన పరీక్షలు.. ముఖాముఖిలకు సిద్ధం

* టీసీఎస్‌ కంపెనీ నియామకాలు ఏటా మాదిరిగానే తమ అనుబంధ కళాశాలలకు టీసీఎస్‌ డిజిటల్‌ పేరిట పరీక్ష నిర్వహించింది. తెలంగాణలో రెండు, ఏపీలో నాలుగు కళాశాలల విద్యార్థులు హాజరయ్యారు. దీనికి ఎంపికైతే రూ.7.20 లక్షల వార్షిక వేతనం ఇస్తారు.

* గోకరాజు కళాశాల నుంచి గతేడాది 100 మందిలోపు షార్ట్‌ లిస్టుకాగా.. ఈసారి 200 వరకు అయ్యారు. వీఎన్‌ఆర్‌ విజ్ఞానజ్యోతి నుంచి మరో 200 మంది ఎంపికయ్యారు. వారికి ముఖాముఖిలు జరగాల్సి ఉంది. ఈ కంపెనీ ప్రతి సంవత్సరంలాగే నింజా(3 లక్షలకు మించి వార్షిక జీతం) నేషనల్‌ క్వాలిఫైయర్‌ పరీక్ష ఈనెల 13 నుంచి దేశవ్యాప్తంగా నిర్వహించబోతోంది. దీనికి అన్ని కళాశాలల విద్యార్థులు హాజరుకావొచ్చు.

* కాగ్నిజెంట్‌ కంపెనీ జెన్‌సీ నెక్ట్స్‌(రూ.8 లక్షల వేతనం), జెన్‌ సీ ఎలివేట్‌(రూ.4 లక్షలు) అనే పరీక్షలు జరిపింది. భారత్‌లో 2022 కోసం ఈ ఏడాది 45 వేల మందిని నియమించుకుంటామని ఆ కంపెనీ ఇటీవల వెల్లడించింది.

* క్యాప్‌ జెమినీ తమ అనుబంధ కళాశాలలకు నియామకపు తేదీలను ప్రకటించింది. సెప్టెంబరు నుంచి నియామకాల జోరు మరింత పెరగనుంది.

* ఇన్ఫోసిస్‌ ఈ ఏడాదిలో 26 వేలు, విప్రో 9 వేలు, హెచ్‌సీఎల్‌ 12 వేలకు పైగా నియామకాలు చేపట్టనున్నాయి.

* విప్రో సంస్థ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మొదలుపెట్టింది.

ఈసారి ప్రొడక్ట్‌ కంపెనీలూ...

సాఫ్ట్‌వేర్‌ను రూపొందించే ప్రొడక్ట్‌ కంపెనీలు కూడా ఎక్కువ మందిని ఎంపిక చేసుకుంటుండటం కొత్త పరిణామం. హైదరాబాద్‌లోని ఎంవీఎస్‌ఆర్‌ కళాశాలలో గతేడాది మోదక్‌ ఎనలిటిక్స్‌ అనే కంపెనీ 17 మందిని ఎంపిక చేసుకోగా ఈసారి ఆ సంఖ్య 37కి పెరిగింది. ఇంకా జెమోసో, ఓపెన్‌ టెక్ట్స్‌, ఎల్‌టీఐ వంటి పరిశ్రమలు నియామకాలకు పోటీపడుతున్నాయి. ఎంవీఎస్‌ఆర్‌ కళాశాల ప్రాంగణ నియామకాల అధికారి ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ కొన్ని కంపెనీలు ఈసారి వార్షిక వేతన ప్యాకేజీలను రూ.4.50 లక్షల నుంచి రూ.6.50 లక్షలకు పెంచాయన్నారు. వీఎన్‌ఆర్‌ విజ్ఞాన జ్యోతి ప్లేస్‌మెంట్‌ అధికారి పార్థసారథి మాట్లాడుతూ ఈసారి నియామకాల సంఖ్య, వేతనంలో 5-10 శాతం మధ్య పెరుగుదల ఉండనుందని చెప్పారు.

లోపాలను సరిదిద్దుకొని ముందుకు సాగండి..

నూరు శాతం ప్రయత్నలోపం లేకుండా కృషి చేయండి. ఒకవేళ ఎంపిక కాకుంటే నిరాశ పడకుండా తర్వాత కంపెనీకి లోపాలను సరిదిద్దుకొని ముందుకు సాగాలి. ఒక కంపెనీ ప్లేస్‌మెంట్‌కు సంబంధించి తేదీ వస్తే ఆ కంపెనీ నియామక ప్రక్రియకు తగ్గట్లు సిద్ధం కావడంతో పాటు ఆప్టిట్యూడ్‌, సీ, డేటా స్ట్రక్చర్స్‌, జావా కంప్యూటర్‌ లాంగ్వేజీలతో పాటు కోడింగ్‌పై పట్టు సాధించాలి. ఆన్‌లైన్‌ పరీక్ష అని విద్యార్థులు ఇతరుల సహాయం తీసుకొని కొలువు దక్కించుకోవాలనే ప్రయత్నం చేసినా ఉద్యోగంలో చేరాక కొద్దినెలల తర్వాత తొలగించడం ఖాయం. మేం శిక్షణ ఇచ్చే కళాశాలలతో ఈ విషయం చర్చించి అందుకనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాం.

- కాంచనపల్లి వెంకట్‌, సీఈఓ, సన్‌టెక్‌ కార్ప్‌ ప్లేస్‌మెంట్‌ శిక్షణ సంస్థ

గత ఏడాది (2020-21 విద్యా సంవత్సరం) రాష్ట్రం నుంచి 28,495 మంది ప్రాంగణ నియామకాలకు ఎంపికయ్యారు. ఈసారి ఇంకా పెరగవచ్చని ఇంజినీరింగ్‌ కళాశాలల ప్లేస్‌మెంట్‌ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇదీ చదవండి: SCHOOLS REOPEN: రాష్ట్రంలో తెరచుకోనున్న విద్యాసంస్థలు

Last Updated : Sep 1, 2021, 2:03 PM IST

ABOUT THE AUTHOR

...view details