ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సుధీర్ఘంగా సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం... ఆర్టీసీ వ్యవహారంపై విస్తృత స్థాయిలో చర్చించింది. సంస్థ స్థితిగతులు, కార్మికుల సమ్మె నిర్ణయం నేపథ్యంలో ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన వ్యూహంపై కేబినెట్ చర్చించింది. పేద ప్రజలకు రవాణా సౌకర్యం కల్పిస్తోన్న ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లోనూ.. కాపాడుకోవాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఇందుకోసం అనుసరించాల్సిన వ్యూహంపై భేటీలో చర్చించింది.
సోమేశ్ అధ్యక్షతన కమిటీ..
సంస్థ పరిరక్షణ కోసం అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలని కేబినెట్ అభిప్రాయపడింది. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమైన నేపథ్యంలో, వారి డిమాండ్లు పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీని నియమించింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధ్యక్షతన ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు, సునీల్ శర్మ సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఇవాళ ఆర్టీసీ కార్మికులతో చర్చించనుంది. కార్మికుల డిమాండ్లను సమగ్రంగా పరిశీలించి, ప్రభుత్వానికి వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.
సమ్మె విరమించండి..