BRS Protest Programmes Against Congress : గతంలో తాము చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకత్వం పోరుబాటకు సిద్ధమైంది. లబ్ధిదారులకు అండగా అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు భారత రాష్ట్ర సమితి(BRS) ప్రకటించింది. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ఇంఛార్జీలతో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, సీనియర్ నేత హరీశ్ రావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ప్రజాస్వామ్యబద్ధంగా హామీలు అమలు చేయాలని కోరితే బీఆర్‌ఎస్‌పై నిందలా : వినయ్ భాస్కర్
ఈ టెలికాన్ఫరెన్స్ కార్యక్రమంలో ప్రజలకు లబ్ధి కలిగిస్తున్న సంక్షేమ పథకాల రద్దుకు కాంగ్రెస్ ప్రభుత్వం(Congress) కుట్ర చేస్తోందని వారు పార్టీ శ్రేణులకు సూచించారు. ఇందుకు పార్టీ తరఫున నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన అనేక పథకాలను కేవలం రాజకీయ అక్కసుతో ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసుకుంటూ వెళ్తోందని మండిపడ్డారు. పదేళ్లుగా లక్షలాది మందికి ఉపయోగపడి, వారి జీవితాల్లో మార్పు తెచ్చిన కార్యక్రమాలను కేవలం రాజకీయ దురుద్దేశంతో పక్కన పెడుతోందని ఆక్షేపించారు.
అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ ప్రభుత్వం అనే వ్యవస్థ శాశ్వతం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని టెలికాన్ఫరెన్స్‌లో అన్నారు. గత ప్రభుత్వం అనుమతులు, నిధులు ఇచ్చిన రోడ్లు, భవనాల వంటి ప్రజా ప్రయోజన మౌలిక వసతుల పనులను కూడా రద్దు చేస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికే గృహలక్ష్మి కార్యక్రమాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని లబ్దిదారుల ఎంపిక పూర్తై అధికారిక పత్రాలు అందుకున్న వారి పరిస్థితి ఏమిటో ప్రభుత్వం తెలపాలని డిమాండ్ చేశారు.
BRS Latest News :ఇప్పటికే లబ్ధిదారులు ప్రభుత్వం అందించిన అధికారిక పత్రాల ఆధారంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్, హరీశ్‌రావు టెలికాన్ఫరెన్స్‌లో నేతలతో చెప్పారు. ప్రజల ప్రయోజనాలకు లబ్ధి కలిగించే ఏ కార్యక్రమాన్ని వ్యతిరేకించినా, రద్దు చేసిన ప్రజల తరఫున బీఆర్ఎస్ పోరాడుతోందన్నారు. లక్షలాది మంది యాదవుల కుటుంబాల్లో ఆర్థిక భరోసా కల్పించిన గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కూడా రద్దు చేయడానికి కాంగ్రెస్ యత్నిస్తోందని ఆరోపించారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక - పార్టీ వాణి బలంగా వినిపించే వారికే బీఆర్ఎస్ ఛాన్స్!
KTR and Harishrao Teleconference :దళితబంధు కార్యక్రమాన్ని మరింతగా విస్తరించి రూ.12 లక్షలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడాలని ఇప్పటికే ఎంపికైన లబ్దిదారులకు పది లక్షలైనా లేదా 12 లక్షల రూపాయలైనా వెంటనే అందించాలని కోరారు. దళితబంధుకు ఎంపికైన వారికి వెంటనే నిధులు చెల్లించి యూనిట్లు ప్రారంభమయ్యేలా చూడాలని అన్నారు. ఇలా ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటూ వెళ్లి తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తీరని ద్రోహం చేస్తోందని అన్నారు.
లబ్దిదారుల కోసం పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కేటీఆర్, హరీశ్‌రావు పిలుపునిచ్చారు. సంక్షేమ కార్యక్రమాలతో పాటు గత ప్రభుత్వం పట్టణాలకు, గ్రామాలకు మంజూరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రభుత్వం రద్దు చేస్తోందన్నారు. ఇప్పటికే నిధులకు సంబంధించిన టెండరింగ్ ప్రక్రియ ప్రారంభం కూడా అయిందని, ఆర్ అండ్ బీ, ఇతర పౌరవసతుల కార్యక్రమాలు ప్రారంభం కావాల్సి ఉన్న పరిస్థితుల్లో రద్దు చేయడం దుర్మార్గమని ఆక్షేపించారు.
ఒక్క ఎమ్మెల్యేను తీసుకుంటే అక్కణ్నుంచి పది మంది వస్తారు : గంగుల