BRS On Jamili Election 2023 : అసెంబ్లీ ఎన్నికలకు మూడునెలల ముందే అభ్యర్థులను ప్రకటించి, ఆశ్చర్యపర్చిన బీఆర్ఎస్(BRS) అధినేత.. మూడోసారి అధికారంలోకి వస్తామనే గట్టి ధీమాతో ఉన్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల(One Nation One Election) చర్చ తెరపైకి రావటంతో ఆ దిశగానూ గులాబీ పార్టీ సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. అందుకు సిద్ధంగా ఉండాలని భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు యథావిధిగా నిర్వహించినా.. ఒకవేళ పార్లమెంటుతో కలిపి చేపట్టినా దీటుగా ఎదుర్కొందామని ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) పార్టీ నాయకులకు నిర్దేశించినట్లు తెలిసింది. ఇటీవల పార్టీ ముఖ్య నాయకులతో వరుసగా నిర్వహించిన సమావేశాల్లో జమిలి ఎన్నికలపై ప్రధానంగా చర్చించినట్లుగా తెలుస్తోంది.
CM KCR Is Ready For Jamili Elections 2023 : జమిలి ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తే.. అందులో తాము చేసేదేమీ ఉండదని.. వద్దంటే ఆగేది కాదని సీఎం పార్టీ నేతల వద్ద వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఏ విధంగానూ ఈ విషయంలో ప్రభావం చూపలేనప్పుడు అనవసరమైన ఆందోళన అవసరంలేదన్నారు. నిర్దేశిత గడువు ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరిపినా.. అలా కాకుండా పార్లమెంటు ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాలని కేంద్రం నిర్ణయించినా సిద్ధమేనని స్పష్టం చేశారు. ఈ క్రమంలో పార్లమెంటు ఎన్నికలు ముందుకొచ్చినా.. అసెంబ్లీ ఎన్నికలు ఆలస్యంగా జరిగినా.. అందుకు సిద్ధపడాల్సిందేనని పార్టీ నేతలకు నిర్దేశించినట్లు తెలిసింది.
Telangana Assembly Election 2023 : జమిలి ఎన్నికలు తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్‌పై ప్రభావం చూపుతాయా?
BRS on One Nation One Election : ఒకవేళ అసెంబ్లీ ఎన్నికలు ఆలస్యమైనా కూడా పార్టీకి మేలే జరుగుతుందని అభిప్రాయపడినట్లు సమాచారం. అసెంబ్లీ కాలపరిమితిని మరో ఆరేళ్లు పొడిగిస్తే.. ఆ మేరకు మరిన్ని అభివృద్ధి పనులు చేసి, ప్రజలకు చేరువ అవ్వడానికి అవకాశాలు పెరుగుతాయనే అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలుస్తోంది. జమిలి ఎన్నికలు జరిగినా కూడా.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభావం తెలంగాణలో ఏమీ ఉండబోదని.. కచ్చితంగా బీఆర్ఎస్నే అత్యధిక అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలను గెలుచుకుంటుందని సీఎం ధీమా వ్యక్తం చేసినట్లు తెలిసింది.
గత పార్లమెంటు ఎన్నికల్లో 3 స్థానాల్లో బీఆర్ఎస్ ఓటమికి కారణాలు : గత పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ తదితర లోక్‌సభ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోవడానికి కారణాలు కూడా ఈ సందర్భంగా నేతల మధ్య చర్చకొచ్చినట్లు తెలిసింది. ఆ ఓటమికి పూర్తిగా మోదీ, బీజేపీ ప్రాభల్యమే కాదని, ఆ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు కచ్చితంగా గెలుస్తారనే అతి విశ్వాసమూ కారణమని విశ్లేషించినట్లు తెలిసింది. ఉదాహరణగా ఖమ్మం, మహబూబాబాద్, కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గాలను ప్రస్తావించినట్లు సమాచారం.