తెలంగాణ

telangana

ETV Bharat / state

గోదావరి నీటిలోకి.. నిండు ప్రాణాలు

సరదాగా సందర్శనకు వెళ్లినందుకు.. నిండు ప్రాణాలు గోదావరిలో కలిశాయి. పర్యాటకం... తీరని విషాదాన్ని మిగిల్చింది. మెుత్తం 73 మంది బోటులో ప్రయాణిస్తున్నారు. 26 మంది సురక్షితంగా బయటకు రాగా... 39 మంది ఆచూకీ గల్లంతైంది. ఇప్పటి వరకూ 8 మృతదేహాలు బయటకు తీశారు.

గోదావరి నీటిలోకి.. నిండు ప్రాణాలు

By

Published : Sep 15, 2019, 10:03 PM IST

Updated : Sep 16, 2019, 12:02 AM IST

తూర్పుగోదావరి జిల్లా పాపికొండల పర్యాటకంలో పెను విషాదం జరిగింది. గోదావరిలో బోటు ప్రమాదానికి గురై నిండు ప్రాణాలు నీటమునిగాయి. పోలవరం మండలం సింగనపల్లి రేవు నుంచి 73 మందితో బయలుదేరిన రాయల్‌ వశిష్ట బోటు... మధ్యలో గండిపోచమ్మ ఆలయం వద్ద ఆగింది. అక్కడే పర్యాటకులు అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం బయలుదేరిన బోటు... దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద... కొండ రాయిని ఢీ కొని నదిలో మునిగిపోయింది. ప్రయాణికులు ఒక్కసారిగా చెల్లాచెదురయ్యారు. రెండంతస్తుల బోటులో మొదటి అంతస్తులోని వారు రెండో అంతస్తులోకి వెళ్లేందుకు ఒక్కసారిగా ప్రయత్నించిన కారణంగానే.. ప్రమాదం జరిగినట్లు పలువురు చెబుతున్నారు. ఘటనలో.. 26 మంది సురక్షితంగా బయటకు రాగా... 39 మంది ఆచూకీ గల్లంతైంది. ఇప్పటి వరకూ 8 మృతదేహాలు బయటకు తీశారు.

స్థానికులు..లేకపోతే..మరీ దారుణం!

పర్యటకుల్లో లైఫ్ జాకెట్లు ధరించిన వారు నదిలో కొట్టుకుపోవడాన్ని గమనించిన తూటుగుంట గ్రామస్థులు... పడవల్లో వెళ్లి వారిని రక్షించారు. అనంతరం ఒడ్డుకు చేర్చి వారిని రంపచోడవరం ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారు గల్లంతయ్యారు. బోటు నిర్వాహకుల నిర్లక్ష్యమే పెను విషాదానికి కారణమని సంఘటన ఆధారంగా తెలుస్తోంది. ఓ వైపు గోదావరి ప్రవాహం జోరుగా ఉన్నా.. నిర్వహకులు స్వార్థంతో పరిమితికి మించి ఎక్కించుకోవడమే దుర్ఘటనకు కారణమైంది. ఉదయం పదిన్నర గంటలకు ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. స్థానికులు స్పందించి ఉండకపోతే..ఇంకా ఎక్కువ మంది మృతి చెందే వారని...బాధితుడొకరు తెలిపారు.

తెలంగాణ వాసులే ఎక్కువ

పర్యటకుల్లో ఎక్కువ మంది హైదరాబాద్, వరంగల్‌, విశాఖపట్నం నగరాలకు చెందిన వారని అధికారులు తెలిపారు. రాష్ట్రానికి చెందిన 36 మంది బోటులో ఉన్నారు. హైదరాబాద్‌కు చెందిన 22 మంది ...వరంగల్‌ నగరానికి చెందిన 14 మంది బోటులో ప్రయాణించారు. వీరిలో ఐదుగురు వరంగల్‌ వాసులు ఒడ్డుకు చేరారు. 9 మంది ఆచూకీ గల్లంతైంది. విశాఖకు చెందిన 9 మంది పడవ ప్రమాదంలో గల్లంతయ్యారు. అందులో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నారు. ఇప్పటికే బాధితుల బంధువులు దేవీపట్నం బయలుదేరారు.

రంపచోడవం ఆసుపత్రిలో బాధితులు

బోటు నడిపిన ఇద్దరు డ్రైవర్లు నూకరాజు, తామరాజు సైతం చనిపోయారు. 10 మృతదేహాలను అధికారులు దేవీపట్నం పోలీస్టేషన్‌కు తరలించారు. ప్రమాదంలో ఇప్పటి వరకు 26 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చగా... 39 మంది ఆచూకీ గల్లంతైంది. గాయపడిన వారిని రంపచోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులు తమ వారి జాడ తెలియక కన్నీరుమున్నీరవుతున్నారు. ఆయా కుటుంబాల్లో విషాదఛాయాలు అలుముకున్నాయి.

సమాచారం కోసం టోల్​ ఫ్రీ నెంబర్లు

ప్రమాద సమాచారం అందించేందుకు అధికారులు టోల్‌ఫ్రీ నంబర్‌ 1800-233-1077 ఏర్పాటు చేశారు. మరోవైపు విశాఖ జిల్లా వాసులు ఉండటంపై కలెక్టర్ వినయ్ చంద్ స్పందించారు. కలెక్టరేట్​లో టోల్‌ఫ్రీ నెంబర్-1800 425 00002 ఏర్పాటు చేశారు.

కొనసాగుతున్న సహాయక చర్యలు

ఎన్డీఆర్​ఎఫ్ బృందం సహాయక చర్యలు కొనసాగిస్తోంది. విశాఖ నుంచి డోర్నయిర్ యుద్ధవిమానంలో సిబ్బందితో పాటు ఏడుగురు గజ ఈతగాళ్లు ఘటనా స్థలానికి బయలుదేరారు. మృతదేహాల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

ప్రముఖుల దిగ్భ్రాంతి..

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో సహా ప్రధాని మోదీ...పడవ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్, ముఖ్యమంత్రి జగన్ సహాయక చర్యలపై ఆరా తీస్తున్నారు. బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి జగన్ 10 లక్షల పరిహారం ప్రకటించారు. మంత్రులు కన్నబాబు, ఆళ్ల నాని, పిల్లి సుభాష్ చంద్రబోస్ రంపచోడవరం ప్రభుత్వాసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం ప్రకటించింది. మంత్రి కేటీఆర్... ఫోన్​లో బాధితులను పరామర్శించారు.

గోదావరి నీటిలోకి.. నిండు ప్రాణాలు

ఇదీ చదవండి:

పాపం పర్యటకులు.. పాపికొండలు చూద్దామని వచ్చి ఇలా..!

Last Updated : Sep 16, 2019, 12:02 AM IST

ABOUT THE AUTHOR

...view details