ఏపీలో కొవిడ్ కేసులతో పాటు బ్లాక్‌ఫంగస్ కేసులు క్రమంగా పెరగడం గుబులురేపుతోంది. కర్నూలు జిల్లాలో ఈ మధ్యే ఇద్దరు బ్లాక్‌ఫంగస్‌తో చనిపోగా మరో ఇద్దరు ఈ వ్యాధి బారినపడ్డారు. తాజాగా మంత్రాలయానికి చెందిన మహిళకు, ముచ్చగిరి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వీరభద్రాచారికి బ్లాక్‌ఫంగస్ సోకింది. వీరిద్దరూ కర్నూలులో చికిత్స పొందుతున్నారు. కృష్ణాజిల్లాలో ఇప్పటి వరకు 20 బ్లాక్ ఫంగస్ కేసులు గుర్తించామని సంయుక్త కలెక్టర్ శివశంకర్ చెప్పారు.
బ్లాక్‌ఫంగస్ చికిత్సకు అవసరమైన యాంపోటెరిసిన్-బి ఇంజక్షన్లు మార్కెట్‌లో దొరకకపోవడం రోగుల కుటుంబాల్లో ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్‌లోనూ దొరకడం కష్టంగా మారింది. ఈ ఇంజక్షన్ల కొనుగోలుకు ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. కేంద్రం ఇచ్చే ఇంజక్షన్లకు తోడు అదనంగా సమకూర్చుకునేందుకు ఆయా ఔషధ తయరీ సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించింది. ప్రైవేటులో చికిత్స పొందే బ్లాక్‌ఫంగస్ రోగులకూ వైద్య ఆరోగ్య శాఖ ద్వారానే ఇంజక్షన్ల సరఫరా చేయాలని భావిస్తున్నారు.