కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటాను కాపాడుకోవడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఘోరంగా విఫలమయ్యారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ హక్కులు కాపాడబడాలంటే కేఆర్ఎంబీ పరిధి నోటిఫై చేయాలని కోరారు. కృష్ణా రివర్ బోర్డు పరిధిని వెంటనే నోటిఫై చేయాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు లేఖ రాసినట్లు బండి సంజయ్ తెలిపారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజల బాగోగుల్ని పక్కనపెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం నదీ జలాల అంశాల్ని వివాదం చేస్తున్నారని విమర్శించారు. కృష్ణా నదిపై ఏపీ అక్రమ ప్రాజెక్టులు కట్టేందుకు కేసీఆర్ అవకాశం ఇచ్చి తెలంగాణకు ద్రోహం చేశారని మండిపడ్డారు.
రాష్ట్రానికి దక్కాల్సింది 555టీఎంసీలు
ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 2014లో 811 టీఎంసీల కృష్ణా జలాల్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తాత్కాలిక ప్రాతిపదికన వినియోగించుకునేందుకు ఒప్పందం చేసుకున్నాయని తెలిపారు. ఇక్కడే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి తీరని నష్టం చేశారని పేర్కొన్నారు. కృష్ణా జలాల్లోని 811 టీఎంసీల్లో తెలంగాణ రాష్ట్రం కేవలం 299 టీఎంసీలు మాత్రమే వాడుకొని... ఆంధ్రప్రదేశ్ 512 టీఎంసీలు వాడుకునేందుకు కేసీఆర్ అంగీకరించి... ఘోర తప్పిదం చేసి తెలంగాణ నోట్లో మట్టికొట్టారని ఆరోపించారు. తెలంగాణలో కృష్ణా నది పరివాహక ప్రాంతం 68.5శాతం ఉందని... దీని ప్రకారం తెలంగాణకు 555 టీఎంసీల వాటా రావాల్సి ఉందన్నారు. కేసీఆర్ మాత్రం కేవలం 299 టీఎంసీలకే అంగీకరించి తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీశారని ఆక్షేపించారు.