Bandi Sanjay mouna deeksha: పంజాబ్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాన్వాయ్‌ని నిరసనకారులు అడ్డుకున్న ఘటనలో మహా కుట్ర ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. నిరసనకారులపై ఎస్పీజీ సిబ్బందితో కాల్పులు జరిపించి రైతులను చంపించి భాజపాను అప్రతిష్ట పాలు చేయాలని కాంగ్రెస్ భావించిందని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ చైతన్యపురిలో భాజపా ఎస్సీ మోర్చా నిర్వహించిన మౌనదీక్షలో పాల్గొన్న అనంతరం బండి సంజయ్ మాట్లాడారు. ప్రధాని పర్యటనలో జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరపడంతో పాటు బాధ్యులందరిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పంజాబ్‌లో జరిగిన ఘటనపై వాస్తవాలు తెలుసుకోకుండా తెరాస కాంగ్రెస్‌కు వత్తాసు పలుకుతుందని దుయ్యబట్టారు. అనంతరం మోదీ ఆయురారోగ్యాలతో ఉండాలని అల్కాపురిలోని శృంగేరిమఠంలో చేపట్టిన మృత్యుంజయ హోమంలో సంజయ్‌తోపాటు డీకే అరుణ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజాపాలన, శక్తివంతమైన ప్రధాని నరేంద్రమోదీ పాలనను అప్రతిష్ట పాలు చేయాలనే ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీనికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా భాజపా ఆధ్వర్యంలో మౌనదీక్షలు చేపట్టాం. -బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు