Telangana Bjp Protests: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్‌కు నిరసనగా 14రోజులపాటు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని భాజపా నిర్ణయించింది. రేపటి నుంచి ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని ఆ పార్టీ నాయకులు తెలిపారు. 14 రోజుల పాటు రాష్ట్ర నాయకులతో పాటు... రోజుకొక కేంద్ర మంత్రి కానీ... జాతీయ నాయకుడు కానీ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి తెలిపారు.
సీఎం కేసీఆర్ అప్రజాస్వామిక నిర్బంధ రాజకీయాలకు వ్యతిరేకంగా... ప్రజలు భాజపాతో అడుగు కలపాల్సిందిగా కోరుతున్నామని ప్రేమేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. భాజపా కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో 14రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు. 317 జీవోను సవరించాలని, నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని నిరసన చేసిన వ్యక్తిపై అక్రమ కేసులు పెట్టడాన్ని వారు ఖండించారు. అక్రమ కేసులు పెట్టారు కాబట్టే... 14 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.