BJP Plans Lok Sabha Elections 2024 :బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నికలపై రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీకి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షత వహించగా, రాష్ట్ర ఇంఛార్జీలు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, సహ ఇంఛార్జీ అరవింద్ మీనన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అభ్యర్థుల ఎంపిక, పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర పదాధికారులు, పార్లమెంట్ ఇంఛార్జీలకు దిశానిర్దేశం చేశారు.
BJP Lok Sabha Elections 2024 Telangana : పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ నాయకత్వం నిర్దేశించిన 10 ఎంపీ, 35 శాతం ఓట్ల సాధించడమే లక్ష్యంగా చర్చించారు. ఇందులో భాగంగా పార్లమెంట్ నియెజకవర్గాలకు ఇంఛార్జీలను నియమించారు. 8 మంది ఎమ్మెల్యేలు, ఒక్క ఎమ్మెల్సీకి బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల సమన్వయయం కోసం పార్లమెంట్ కన్వీనర్లతో పాటు ఆర్గనైజేషన్ ఇంఛార్జీలను నియమించాలని యోచిస్తోంది. జిల్లా అధ్యక్షులతో పాటు రాష్ట్ర పదాధికారుల్లో మార్పులు, చేర్పులకు శ్రీకారం చుట్టింది. 15 నుంచి 20 జిల్లాల అధ్యక్షులను మార్చాలని నిర్ణయించింది. ఇప్పటికే జిల్లా అధ్యక్షుల పేర్లను ఖరారు చేసి, జాతీయ నాయకత్వానికి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అందజేశారు.
లోక్‌సభ స్థానాలకు ఇంఛార్జీలను నియమించిన బీజేపీ - 8 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీకి బాధ్యతలు
BJP Focus on Parliament Elections 2024 : సన్నాహక సమావేశంలో ఎన్నికల రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా జిల్లాలు, వర్గాల వారీగా సమావేశమై ఎన్నికల ప్రణాళికకు సంబంధించిన అంశాలను సేకరించాలని భావిస్తోంది. కొత్తగా ఓటు హక్కు వచ్చిన యువతను స్వయంగా వెళ్లి కలవడంతో పాటు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో వారితో సమావేశాలు ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.
కేంద్ర సంక్షేమ పథకాలు, మోదీ సాహసోపేతమైన నిర్ణయాలు, తెలంగాణకు కేటాయించిన నిధులు, గత బీఆర్ఎస్ సర్కారు వైఫల్యాలు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలులో ఆలస్యం వంటి అంశాలను ప్రజలకు వివరించాలని నేతలు మార్గనిర్దేశం చేశారు. కేంద్రంలో మరోసారి బీజేపీ సర్కారు ఆవశ్యకతను వివరిస్తూ, ప్రతి గ్రామంలో కార్నర్ మీటింగ్స్ నిర్వహించాలని యోచిస్తోంది. ఈ నెలాఖరుకు ప్రధాని మోదీ అధికారిక పర్యటనలో భాగంగా రాష్ట్రానికి రానున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో పార్టీ తరుఫున సభలు పెట్టాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.