రాష్ట్రంలో కాషాయ జెండాను రెపరెపలాడించేందుకు కమలనాథులు సిద్ధమవుతున్నారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు 2023లో అధికారమే లక్ష్యంగా కొత్త జట్టు సిద్ధమవుతోంది. పార్టీ జాతీయ నాయకత్వం రాష్ట్ర కమల దళపతిగా బండి సంజయ్‌ని నియమించింది. కరోనా వల్ల దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించడం వల్ల బండి వేగానికి బ్రేకులు పడ్డాయి. పార్టీ కార్యక్రమాలు, నూతన జట్టును నియమించుకునేందుకు అంతరాయం ఏర్పడింది.
లాక్డౌన్ సడలింపులతో పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతూనే... రాష్ట్ర కమిటీ కూర్పుపై దృష్టి సారించిన సంజయ్.. కోర్ కమిటీ సభ్యులతో పలుమార్లు విస్తృతంగా చర్చించారు. ముహూర్తం, మంచి రోజులు చూసుకునే భాజపా... ఆషాఢమాసం కావడం వల్ల కొత్త కమిటీని ప్రకటించలేదు. శ్రావణ మాసం ప్రారంభమవుతున్నందున కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పార్టీ సీనియర్ నేతలు మురళీధర్ రావు, లక్ష్మణ్‌తో సంజయ్ కుమార్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సమావేశంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, పెండింగ్‌లో ఉన్న జిల్లా కమిటీలపైన ప్రధానంగా చర్చించారు.
రాష్ట్ర కమిటీకి ముందే పెండింగ్‌లో ఉన్న జిల్లా కమిటీలను.. గ్రేటర్ పరిధిలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు అధ్యక్షులను నియమించాలని భావిస్తోంది. తెదేపా, కాంగ్రెస్, తెరాస నుంచి పెద్ద సంఖ్యలో భాజపాలో చేరడం వల్ల పాత, కొత్త కలయికతో కమిటీలను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. అసమ్మతి తలెత్తకుండా ఉండేందుకు రాష్ట్ర, జాతీయ కమిటీ, పార్టీ అనుబంధ సంఘాలతో పాటు ప్రత్యేక కమిటీల వైపు మొగ్గు చూపుతోంది. రాష్ట్రంలో భాజపాను అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రత్యేక కమీటీలను ఏర్పాటు చేస్తోంది.
ఇతర రాష్ట్రాల్లో భాజపాను అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీలు సఫలీకృతం కావడం వల్ల తెలంగాణలోను ఆ తరహా ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర కమిటీ కంటే... ప్రత్యేక కమిటీలకే ప్రాధాన్యత ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోసారి కీలక నేతలతో పాటు సంఘ్ నేతలను కలిసి కమిటీని ప్రకటించనున్నారు. ఈ నెలాఖరు వరకు ఏ క్షణమైనా కొత్త జట్టును ప్రకటించే అవకాశం ఉందని పార్టీవర్గాల నుంచి సమాచారం.
ఇవీ చూడండి:తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా... కుటుంబ సభ్యులందరికీ పాజిటివ్