BJP Nirudyoga Mahadharna in Hyderabad : తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పనిచేస్తోన్న కాషాయదళానికి టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ ఒక అస్త్రంగా దొరికింది. ఇప్పటికే అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ బీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూనే.. క్షేత్రస్థాయిలో బలోపేతం అవుతున్న కాషాయపార్టీకి ఈ అవకాశం అందివచ్చింది. ఎన్నికల ఏడాది కావడంతో పోరాట పంథాలో దూసుకువెళ్లాలని భావిస్తోంది. అందివచ్చిన అవకాశాలను వదలకుండా వాడుకోవాలని నిర్ణయించింది.
'మా నౌకరీలు మాగ్గావాలే' అనే నినాదంతో ధర్నా : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ ఘటనపై దూకుడుగా ముందుకు వెళ్లాలని రాష్ట్ర నాయకత్వాన్ని జాతీయ నాయకత్వం హైకమాండ్ ఆదేశించింది. ఈ క్రమంలో ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో 'నిరుద్యోగ మహాధర్నా'కు సిద్ధమైంది. ఈ రోజు ఇందిరా పార్కు ధర్నాచౌక్ వేదికగా 'మా నౌకరీలు మాగ్గావాలే' అనే నినాదంతో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నాం 3 గంటల వరకు మహాధర్నా చేయనుంది. మహాధర్నా కోసం బీజేపీ రాష్ట్ర నాయకత్వం పోలీసుల అనుమతి కోరింది. మొదట పోలీసులు అనుమతి నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన న్యాయస్థానం ధర్నాకు షరతులతో అనుమతి ఇచ్చింది. దాంతో మహాధర్నాను విజయవంతం చేసేందుకు ఇప్పటికే ఇందిరా పార్కు ధర్నాచౌక్ వద్ధ కాషాయదళం అన్ని ఏర్పాట్లు చేసింది.