తెలంగాణలో పాగా వేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న కమలదళం... ఇందుకు హైదరాబాద్‌లో జులై తొలివారంలో జరిగే భేటీని ఒక అవకాశంగా మార్చుకోవాలని చూస్తోంది. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో జాతీయ నేతలు పర్యటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. బుధవారం కేంద్ర కార్యాలయంలో సమావేశాల నిర్వహణ స్టీరింగ్ కమిటి సమీక్షలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
జులై 2, 3 తేదీల్లో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశాల్లో హజరైయ్యేందుకు కేంద్ర మంత్రులు, పలువురు జాతీయ నేతలు ముందుగానే హైదరాబాద్ చేరుకుంటారు. ఈనెల 30 ఉదయానికే సుమారు 190 మంది కార్యవర్గ సభ్యులు భాగ్యనగరానికి రానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. వీరంతా... పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించేలా రాష్ట్ర నాయకత్వం ఏర్పాట్లు చేస్తుంది. అనంతరం కార్యవర్గ సమావేశాల ప్రారంభానికి ముందే తెలంగాణలో పార్టీ పరిస్థితి, ఏ నియోజకవర్గంలో ఎలా ఉందో ఒక నివేదిక అందించనున్నట్లు కేంద్ర కార్యాలయ వర్గాలు తెలిపాయి. కేంద్ర మంత్రులు, జాతీయ నేతల క్షేత్రస్థాయి పర్యటన వల్ల.. పార్టీకి నూతనోత్తేజం వస్తుందని, బలోపేతం అవడానికి ఇదొ మార్గమని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించే సందర్భంలో.. బూత్ స్థాయి నేతలు, కార్యకర్తలతో మమేకం కానున్నారు.