తెలంగాణ

telangana

By

Published : Jul 1, 2021, 10:42 PM IST

ETV Bharat / state

VIJAYASANTHI: ప్రభుత్వ భూముల అమ్మకాన్ని సవాలు చేస్తూ విజయశాంతి పిల్

ప్రభుత్వ భూములు విక్రయించాలన్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ భాజపా నాయకురాలు విజయశాంతి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం​ దాఖలు చేశారు. హెచ్​ఎండీఏ పరిధిలోని భూముల వేలం కోసం జారీ చేసిన నోటిఫికేషన్​ రద్దు చేయాలని పిటిషన్​లో పేర్కొన్నారు.

VIJAYASANTHI
BJP Leader Vijayashanti files a PIL in high court

భావితరాలకు ఉపయోగపడే ప్రభుత్వ భూములను అమ్మడం సరికాదని భాజపా నాయకురాలు విజయశాంతి అన్నారు. భూములు విక్రయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. హెచ్​ఎండీఏ పరిధిలోని భూముల వేలం కోసం జారీ చేసిన నోటిఫికేషన్​ రద్దు చేయాలని ఆమె కోరారు.

నిధుల సమీకరణ కోసం విలువైన ప్రభుత్వ భూములు అమ్మడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం తన ఉత్తర్వులకు తానే విరుద్ధంగా వ్యవహరిస్తోందని పిటిషన్​లో విజయశాంతి ఆరోపించారు. ప్రభుత్వం, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ కలెక్టర్లను ప్రతివాదులుగా పిటిషన్​లో ఆమె పేర్కొన్నారు.

హెచ్​ఎండీఏపై భారీ ఆశలు

భూముల విక్రయం ద్వారా నిధుల సమీకరణపై ప్రభుత్వం భారీ ఆశలు పెట్టుకుంది. మొదటి విడతలో హెచ్​ఎండీఏ, టీఎస్- ఐఐసీకి చెందిన 64.93 ఎకరాల భూమిని విక్రయించనుంది. హెచ్​ఎండీఏకు చెందిన కోకాపేటలోని నియోపోలీస్ లేఅవుట్, గోల్డెన్ మైల్ లేఅవుట్లలో 49.92 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మొత్తం 8 ప్లాట్లను విక్రయించనుంది. ఇక్కడ ఆరు ప్లాట్లు ఏడు, ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఉండగా.. రెండు ప్లాట్లు మాత్రమే ఎకరం విస్తీర్ణంలో ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయల కల్పన సంస్థ టీఎస్-ఐఐసీకి హైటెక్ సిటీ సమీపంలోని ఖానామెట్ లేఅవుట్‌లోని 15.01 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 5 ప్లాట్లకు వేలం నిర్వహించనుంది. ఇక్కడున్న అన్ని ప్లాట్లు 2, 3 ఎకరాల చొప్పున విస్తీర్ణంలో ఉన్నాయి. ఎకరానికి కనీస వేలం ధర 25 కోట్లుగా నిర్ణయించిన ప్రభుత్వం... 20 లక్షల చొప్పుల వేలం పెంచుకోవచ్చని ప్రకటించింది. కనీస ధరకు భూముల విక్రయం జరిగినా...రూ. 1,623 కోట్లు ఖజానాకు చేరనున్నాయి.

ఇప్పటికే నోటిఫికేషన్ జారీ

హెచ్​ఎండీఏకు చెందిన కోకాపేట భూములతో పాటు టీఎస్​ఐఐసీకి చెందిన ఖానామెట్ భూముల విక్రయానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటన జారీ చేసింది. నిధుల సమీకరణ కోసం భూముల అమ్మకానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వం, గృహనిర్మాణ సంస్థ వద్ద భూములు, ఇళ్లను విక్రయించడం ద్వారా నిధులు సమకూర్చుకోవాలని గత మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. తాజాగా మంగళవారం జరిగిన కేబినెట్ భేటీలోనూ భూముల అమ్మకం అంశంపై చర్చ జరిగింది. అమ్మకం ప్రక్రియ ప్రారంభమైందా? అని ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆరా తీసినట్లు సమాచారం. గతంలో గృహనిర్మాణ సంస్థ విక్రయించిన భూములకు సంబంధించిన పన్నుల సమస్యను అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను పరిష్కరించుకోవాలన్న సీఎం కేసీఆర్​.. వీలైనంత త్వరగా భూముల అమ్మకం ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.

ఇదీ చూడండి: జులై 15, 16 తేదీల్లో ప్రభుత్వ భూముల వేలం

ప్రభుత్వ భూముల వేలానికి రంగం సిద్ధం.. త్వరలో నోటిఫికేషన్!

ABOUT THE AUTHOR

...view details