అఫ్గానిస్థాన్లో జరుగుతున్న తాజా పరిణామాలపై భాజపా నేత విజయ శాంతి స్పందించారు. అక్కడ పరిస్థితుల్ని చూస్తే... గుండె చెరువైపోతోందని తెలిపారు. 1996 నుంచి 2001 వరకూ అక్కడ చోటుచేసుకున్న పరిణామాల జ్ఞాపకాలు నేటికీ... పీడకలలా వెంటాడుతున్నాయని... అవి స్మృతిపథం నుంచి చెరిగిపోకముందే మళ్ళీ నరరూప రాక్షసులైన తాలిబన్ల ఆటవిక పాలన మొదలైందని వ్యాఖ్యానించారు.
''మహిళల్ని లైంగిక బానిసలుగా చేసి, పిల్లల్ని కనే యంత్రంలా మార్చేసి, విద్య-ఉద్యోగాలకు దూరం చేసిన దుర్మార్గపు రోజులు మళ్ళీ వచ్చేశాయి. నిబంధనలు పాటించని వారిని రాళ్లతో కొట్టి చంపడం, చిన్న తప్పులకే బహిరంగంగా కాళ్ళు, చేతులు నరకడం... మతగ్రంథంలోని నిబంధనలు అనుసరించకపోతే తల నరికేయడం, చెట్టుకు వేలాడదీసి ఉరివేయడం, బతికుండగానే తగులబెట్టడం లాంటి దారుణమైన మధ్యయుగపు మూర్ఖపు శిక్షలు తాలిబన్లకు నిత్యకృత్యం. బురఖా ధరించని ఒక నడివయసు మహిళను... తలపై కాల్చి చంపిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతటి నీచ నికృష్టమైన తాలిబన్ సర్కారును... ఆ దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని పాకిస్థాన్ ప్రశంసించడంలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ గొప్ప కమ్యూనిస్ట్ దేశాలుగా చరిత్రకెక్కిన... చైనా, రష్యాలు కూడా వంతపాడటం దౌర్భాగ్యం.
ఈ పరిణామాలపై మన దేశంలోని కమ్యూనిస్ట్ నేతలు, కాంగ్రెస్ నేతలు ఇంతవరకూ స్పందించనే లేదు. ఇదిలా ఉంటే తాలిబన్లతో చర్చలకు అవకాశం ఉండాలంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కేంద్రానికి సలహా ఇచ్చి తన కుసంస్కారాన్ని చాటుకున్నారు. భారత్‌లోని అఫ్గాన్ రాయబారి స్వయంగా తాలిబన్లను వ్యతిరేకిస్తూ... ఆ దేశంలో ఇంకా పోరాడుతున్న అఫ్గానిస్థాన్ ఉపాధ్యక్షుడిని సమర్థించినప్పుడు, తాలిబన్లలతో భారత్ చర్చలు జరపాలని చెప్పడంలో అంతరార్థమేమిటో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకే తెలియాలి.