BJP focous on Parliament Elections in Telangana : తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కమలం పార్టీ శాసనసభ ఎన్నికల్లో శతవిధాలా ప్రయత్నించింది. అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly elections 2023) పార్టీ ఆశించిన మేర ఫలితాలు రాకపోయినా 8 స్థానాల్లో గెలుపొందింది. ఇక తమ తదుపరి లక్ష్యాన్ని పార్లమెంట్ ఎన్నికలపై పెట్టింది. ఎంపీ స్థానాలపై కమలం పార్టీ నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. దీంతో పార్లమెంట్ స్థానాలపై పలువురు ఆశావహులు కన్నేశారు.
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సీనియర్లు ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. అసెంబ్లీ స్థానం కోల్పోయినా పార్లమెంట్‌పై గురిపెట్టి గెలవాలని భావిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు సునాయసమవుతుందని, మోడీ చరిష్మా తమకు పనికొస్తుందని పలువురు నేతలు అభిప్రాయ పడుతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీలు బండి సంజయ్, సోయం బాపూరావు, ధర్మపురి ఆర్వింద్ ముగ్గురు పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
విద్యార్థి దశ నుంచి ఓటమి తెలియదు - గజ్వేల్‌లో ఓటమి నాలో కసిని పెంచింది : ఈటల రాజేందర్
Telangana BJP MasterPlan on MP Elections :వాస్తవానికి బండి సంజయ్(Bandi sanjay), ధర్మపురి అర్వింద్‌కు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇష్టం లేకపోయినా అధిష్టానం ఆదేశాల మేరకు పోటీ చేయక తప్పలేదు. ఈ ఎన్నికల్లో ఓటమి చవి చూడటంతో వారు మళ్లీ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. అలాగే బీజేపీలో ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు గత ఎన్నికల్లో పోటీ చేసినా అందులో రాజాసింగ్ మాత్రమే గెలిచారు. ఈటల రాజేందర్, రఘునందన్‌రావు ఓడిపోయారు. దీంతో వారు కూడా ఈసారి పార్లమెంట్ బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపుతున్నారు.
గతంతో పోల్చుకుంటే ఈసారి బీజేపీ నుంచి పార్లమెంట్ టికెట్ ఆశించే నేతల సంఖ్య భారీగా పెరిగే అవకాశముంది. కరీంనగర్ టికెట్ ఎవరికిస్తారనే చర్చ పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ జిల్లా నుంచి ఇద్దరు కీలక నేతలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఉన్నారు. ఆ ఇద్దరిలో ఎవరికి టికెట్ దక్కుతుందనేది హాట్ టాఫిక్‌గా మారింది.
గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేసి మెదక్ ఎంపీగా పోటీ చేస్తారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ మెదక్ నుంచి కేసీఆర్‌పై పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు రఘునందన్‌రావు గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో రఘునందన్‌కు పోటీగా టికెట్ కోసం ఈటల వస్తే మెదక్ టికెట్ కోసం పోరు తప్పదని చర్చించుకుంటున్నారు.
ఆరు గ్యారంటీలను అమలు చేయకపోతే అసెంబ్లీ వేదికగా పోరాటమే - బీజేపీ ఎమ్మెల్యేల హెచ్చరిక
MP Elections 2024 in Telangana : ఈటల అనుచరులు మాత్రం మల్కాజిగిరి నుంచి పోటీ చేయాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ స్థానంలో బీజేపీ నుంచి గెలుపు సునాయాసమని చెప్పినట్లుగా సమాచారం. మల్కాజిగిరి స్థానం నుంచి పోటీ చేసేందుకు బీజేపీ మాజీ జాతీయ ప్రధానకార్యదర్శి, మధ్యప్రదేశ్ ఇంచార్జీ మురళీధర్‌రావు గత కొంతకాలంగా పనిచేసుకుంటూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈటలకు ఈ స్థానం ఇచ్చే పరిస్థితి కనబడటంలేదు. మల్కాజిగిరి స్థానం నుంచి పోటీ చేసేందుకు అనేక మంది ఆశావహులు ఎదురు చూస్తున్నారు. మురళీధర్ రావు, ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్ రావు, ఎన్వీఎస్‌ఎస్.ప్రభాకర్, మాజీ ఎంపీ చాడ సురేశ్‌రెడ్డి ఆసక్తి చూపిస్తున్నారు.
ఆదిలాబాద్ ఎంపీగా పోటీ చేసేందుకు ముగ్గురు నేతుల పోటీ పడుతున్నారు. సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావుతో పాటు బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ టికెట్ ను ఆశిస్తున్నారు. మహాబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, మాజీమంత్రి డీకే.అరుణ, తల్లోజు ఆచారి ఆసక్తి చూపుతున్నారు. టికెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. వరంగల్ నుంచి మాజీ ఐపీఎస్ కృష్ణప్రసాద్, మహబూబ్‌బాద్ నుంచి హుసేన్ నాయక్, రాంచంద్రునాయక్ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు.
నల్గొండ నుంచి సంకినేని వెంకటేశ్వర్లు, భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్, శ్యాంసుందర్, గూడూరు నారాయణరెడ్డి పోటీ చేసేందుకు సమాయత్తం అవుతన్నారు. ఇక జహీరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్, ఈటల రాజేందర్, చింతల రాంచంద్రా రెడ్డి, చికోటీ ప్రవీణ్ ఆసక్తి కనబరుస్తున్నారు. అధిష్టానం ఆదేశిస్తే హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు రాజాసింగ్ సిద్ధంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీజేపీ సమాయత్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ప్రణాళికలను రూపొందిస్తోంది. వికసిత భారత్ పేరుతో కేంద్ర ప్రభుత్వ పథకాలను అన్ని గ్రామాల్లోకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తోంది. అన్ని గ్రామాలను కలుపుతూ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో యాత్రలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. విశ్వకర్మ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విధంగా కార్యచరణను రూపొందిస్తోంది.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జ్‌లు, ముఖ్య నేతల సమావేశం జరగనుంది. కిషన్‌రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశానికి తరుణ్ చుగ్, లక్ష్మణ్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. వికసిత భారత్, విశ్వకర్మ పథకాలపై ఈ సమావేశంలో చర్చించడంతో పాటు పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమయాత్తంపై దిశానిర్థేశం చేయనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.
బీజేపీ శాసనసభాపక్షనేత ఎవరో? - కొనసాగుతున్న ఉత్కంఠ