BJP Strategies for Telangana Assembly Elections 2023 :శాసనసభ ఎన్నికలకు సమాయత్తమవుతున్న బీజేపీ అభ్యర్థుల ఎంపికపై దృష్టిపెట్టింది. ఈ మేరకు పార్టీలో ఐదుగురు కీలకనేతల మధ్య ఏకాభిప్రాయం ఉన్న అభ్యర్థులను.. తొలుత ఖరారు చేసే యోచనలో ఉన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్.. ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విడివిడిగా అభ్యర్థుల జాబితాలు రూపొందించనున్నారు.
BJP Candidates Telangana Assembly Elections 2023 : ఆ జాబితాల్లో ఏకాభిప్రాయం ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థులను ముందుగానే ప్రకటించే అంశంపై.. బీజేపీ దృష్టి పెట్టిందని విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు జాబితాలు ఇవ్వాలని.. ఐదుగురు నేతలను బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇంఛార్జ్ ప్రకాశ్ జావడేకర్ కోరినట్లు తెలిసింది. తెలంగాణలో మూడోవంతు సీట్లలో ఏకాభిప్రాయానికి అవకాశం ఉందని.. పార్టీ అంతర్గత పరిశీలనలో గుర్తించారు. తొలివిడతలో 35 నుంచి 40 సీట్ల వరకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని కమలం వర్గాలు అంచనా వేశాయి.
Telangana Assembly Elections 2023 :ఎంపీలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు సహా ముఖ్య నేతలంతా అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులుగా పోటీ చేయాల్సి ఉంటుందని.. జాతీయ నాయకత్వం ఇప్పటికే పార్టీ వర్గాలకు స్పష్టత ఇచ్చింది. ముఖ్య నాయకులు ప్రాతినిధ్యం వహించిన స్థానాల్లో.. బలమైన కొత్త నేతలుంటే వారికి ప్రాధాన్యమివ్వాలని బీజేపీ భావిస్తోంది. అభ్యర్థుల ఎంపికపై కమలంజాతీయ నాయకత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. ప్రతి నియోజకవర్గం నుంచి వివిధ సమీకరణాలు ప్రాతిపదికగా తీసుకొని.. బలమైన నాయకులను బరిలో దింపాలనేది లక్ష్యంగా పెట్టుకుంది.