చతికిలపడిన భాజపా, కాంగ్రెస్... గట్టిపోటీనిచ్చిన తీన్మార్ మల్లన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని భాజపా బరిలోకి దిగింది. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాల జోరుతో రెండు నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీ స్థానం దక్కించుకోవాలని భావించింది. ప్రతి 25 మంది ఓటర్లకు ఇంఛార్జిని పెట్టిన భాజపా... కేంద్ర మంత్రులు ప్రకాశ్ జావడేకర్, రమేశ్ పోఖ్రియాల్, అనురాగ్‌సింగ్ ఠాకూర్ వంటి వారిని ప్రచార బరిలో దింపింది.
రాంచందర్‌రావు గట్టిపోటీ...
హైదరాబాద్ స్థానంలో రాంచందర్‌రావు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ నల్గొండ స్థానంలో ప్రేమేందర్‌రెడ్డి పోటీ ఇవ్వలేకపోయారు. రెండు స్థానాల్లో తమదే గెలుపు అని భావించిన భాజపాకు ఎన్నికల ఫలితాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. నల్గొండ-ఖమ్మం-వరంగల్ నియోజకవర్గంలో ఏకంగా నాలుగో స్థానానికి పడిపోవడం ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నాయి.
పట్టభద్రులంతా భాజపా వైపే మొగ్గు చూపారన్న రాంచందర్‌రావు... ఎన్నికల్లో గెలిచేందుకు తెరాస కోట్లు ఖర్చుచేసిందని ఆరోపించారు. దుబ్బాక, గ్రేటర్ ఫలితాలతో భయపడిన తెరాస... పీవీ నరసింహరావు కుమార్తెను తెరపైకి తీసుకొచ్చిందని ఆరోపించారు.
పరాభవాల పరంపర...
మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పరాభవాల పరంపర కొనసాగుతోంది. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో చతికిలపడిన కాంగ్రెస్... ఈ ఎన్నికల్లో 3,4 స్థానాలు కూడా దక్కించుకోలేకపోయింది. నల్గొండ-ఖమ్మం-వరంగల్ నియోజకవర్గంలో 7.8 శాతం ఓట్లతో కాంగ్రెస్ ఐదో స్థానానికి పరిమితమైంది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో పోటీచేసిన చిన్నారెడ్డి... తెరాస, భాజపా, స్వతంత్రులతో పోటీపడలేక వెనకబడిపోయారు.
స్వతంత్రులే ఎక్కువ...
రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్ కంటే స్వతంత్రులే ఎక్కువ ఓట్లు సాధించారు. నాగార్జునసాగర్ ఉపఎన్నిక ముందు వరుస ఓటములతో ఆ పార్టీ నేతలు నిరాశ నిస్పృహల్లో మునిగిపోయారు. తెరాస ఎన్నికల్లో డబ్బు, మద్యంతోనే గెలిచిందన్న చిన్నారెడ్డి... సాగర్ ఎన్నికల్లో నూతన పద్ధతి అవలంభించి గెలుపొందాలని జానారెడ్డికి సూచించారు.
తీన్మార్ పోటీ...
నల్గొండ-ఖమ్మం-వరంగల్ స్థానంలో స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఓడినా... తెరాసకు గట్టిపోటీ ఇచ్చారు. పార్టీ, కార్యకర్తలు లేకుండా... కేవలం సామాజిక మాధ్యమాన్ని ఆధారంగా చేసుకుని.. సమస్యలను జనంలోకి తీసుకెళ్లి... అన్ని ఓట్లు సాధించారు. ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రజల గెలుపుగా అభివర్ణించిన తీన్మార్ మల్లన్న.... తెరాస డబ్బు, దొంగఓట్లతోనే గెలిచిందని ఆరోపించారు.
ఇదీ చూడండి:హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానంలో వాణీదేవికి పట్టం