Bhatti Vikramarka Planning Review :జంటనగరాల్లో చెరువులు, కుంటల పరిస్థితిపై ఐదు రోజుల్లోపు నివేదిక ఇవ్వాలని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రణాళిక శాఖ అధికారులను ఆదేశించారు. 2014 ముందు ఉన్న చెరువులు, నీటి కుంటలు ఎన్ని? ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఎన్ని చెరువులు అన్యా క్రాంతమయ్యాయి? ప్రస్తుతం చెరువుల పరిస్థితి ఏమిటన్న విషయమై నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రణాళిక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన డిప్యూటీ సీఎం, ప్రభుత్వ ఆలోచన సరళికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుత సంక్షేమ రాజ్యంగా తీర్చిదిద్దే ప్రణాళికలు రావాలని సూచించారు.
Bhatti Vikramarka on Planning Department in Telangana :రాష్ట్ర అభివృద్ధిలో ప్రణాళిక శాఖ పాత్ర కీలకమని, ప్రణాళిక శాఖ రూపొందించే ప్రణాళికలు అభివృద్ధికి దిక్సూచి అవుతాయని పేర్కొన్నారు. గణాంకాలను ఢాంభీకాలకు పోకుండా వాస్తవాలకు దగ్గరగా రూపొందించాలని సూచించారు. ప్రభుత్వ పథకాల అమలు ద్వారా సమాజంలో వస్తున్న మార్పులను శాస్త్రీయంగా అంచనా వేయాలని ఉపముఖ్యమంత్రి తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, అమలు చేసే సంక్షేమ పథకాల సరళిని లెక్కలు కట్టే ప్రణాళిక శాఖ నివేదికల తయారీలో పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులకు చెప్పారు. సర్కార్ అమలు చేస్తున్న పథకాల ద్వారా ప్రజల జీవన స్థితిగతుల్లో వస్తున్న మార్పులు, జీవన ప్రమాణాల పెరుగుదలకు సూచికలు నమోదు చేయడంలో ప్రణాళిక శాఖ కీలకపాత్ర వహిస్తుందని వెల్లడించారు. అధికారులు అంకితభావంతో పనిచేసినప్పుడే ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరుతాయని భట్టి విక్రమార్క వివరించారు.
ఆరు గ్యారెంటీలకు వారెంటీ లేదన్న పెద్దలకు ప్రజలు ఓటుతో చెంపచెల్లుమనిపించారు : భట్టి విక్రమార్క