Bhatti Vikramarka comments on free electricity for farmers : ప్రజల అవసరాలే కాంగ్రెస్ పార్టీ అజెండా అని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క వెల్లడించారు. ఉచిత విద్యుత్తు కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అన్న భట్టి.. మరొకరికి దీనిపై మాట్లాడే హక్కులేదని స్పష్టం చేశారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని తెలంగాణ రాష్ట్రానికి 53 శాతానికిపైగా విద్యుత్ కేటాయింపు జరిగిందని వివరించారు. పీపుల్స్ మార్చ్ పేరుతో 109 రోజులపాటు 1364 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేసిన బట్టి విక్రమార్క ఇవాళ తన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు.
మార్చి 16వ తేదీన ఆదిలాబాద్ జిల్లాలో మొదలైన తన పాదయాత్ర జులై 2న ఖమ్మంలో ముగిసిందని తెలిపారు. అఖిల భారత కాంగ్రెస్ ఆదేశాలతో నిర్వహించిన పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలను కలుసుకునే అవకాశం తనకు కలిగిందని పేర్కొన్నారు. అడుగడుగునా ప్రజలు తమ ఇబ్బందులను తనకు తెలియజేశారని వివరించారు. రాష్ట్రంలో పేదలకు, ధనికులకు మధ్య భారీ వ్యత్యాసం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ అంతరాన్ని తగ్గించేందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కృషి చేసిందని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అది జరగడం లేదని ఆరోపించారు.
Bhatti vikramamarka on Telangana projects : తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి ఆస్తులు లేని ఎమ్మెల్యేలు కూడా భారీ ఎత్తున సంపాదించుకున్నారని.. ఫాంహౌస్‌లు నిర్మించుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పంటలకు అందుతున్న సాగునీరంతా కూడా కాంగ్రెస్ హయంలో నిర్మించిన ప్రాజెక్టుల నుంచేనని వెల్లడించారు. కేసీఆర్ ప్రభుత్వ హయంలో నిర్మించిన ఏ ఒక్క ప్రాజెక్టు నుంచి చుక్క నీరు కూడా అందడం లేదని ఆరోపించారు.