CM KCR To inaugurates BRS Office in Nagpur :భారత్ రాష్ట్ర సమితి పార్టీ మహారాష్ట్రలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించింది. బీఆర్ఎస్ను ఎప్పుడైతే స్థాపించారో ఆరోజు నుంచి మహారాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించింది. అక్కడి నుంచే దేశం మొత్తానికి విస్తరించడానికి సన్నాహాలు కూడా మొదలుపెట్టింది. మహారాష్ట్ర నుంచే బీఆర్ఎస్ దేశరాజకీయాల్లో ప్రవేశించాలని.. అందుకు నాగపూర్నే సరైన వేదికని తొలినాళ్లలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పేవారు.
అందుకే పార్టీ తొలి కార్యాలయాన్ని నాగపూర్‌లో ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావించారు. అందులో భాగంగా గురువారం కేసీఆర్ అక్కడకు వెళ్లి.. పార్టీ కార్యాలయం ప్రారంభించనున్నారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో ముచ్చటించి.. వారిలో జోష్ నింపనున్నారు. ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులు, సామాజిక కార్యకర్తలు కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. అందుకు తగిన ఏర్పాట్లను పార్టీ శ్రేణులు పూర్తి చేశారు.
BRS Party Office In Nagpur : ఇప్పటికే దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగానే మొదటగా దిల్లీలో శాశ్వత కార్యాలయం ప్రారంభించగా.. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోనూ.. తాజాగా మహారాష్ట్రలోని నాగపూర్‌లో ప్రారంభించనున్నారు. త్వరలోనే ఇంకా మహారాష్ట్రలోని పుణె, ముంబై, ఔరంగాబాద్‌లలో కార్యాలయాలు ఏర్పాటుకు సన్నాహకాలు చేస్తున్నారు.
BRS Office In Nagpur :మహారాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే.. వచ్చే రెండేళ్లలో ప్రజలకు ఉచిత విద్యుత్, నీరు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ అధినేతతో పాటు, మహారాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు కూడా హమీలు ఇచ్చారు. త్వరలో మహారాష్ట్రలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు భారాస కసరత్తు చేస్తోంది. మహారాష్ట్రలోని అన్ని నియోజకవర్గాల్లో భారాస సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే సుమారు మూడున్నర లక్షల సభ్యత్వాలు పూర్తయ్యాయని పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రతి గ్రామంలో రైతు, మహిళ, యువత.. ఇలా తొమ్మిది కమిటీలు ఉండాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. పార్టీ నాయకులకు ట్యాబ్‌లతో పాటు జెండాలు, ఫ్లెక్సీలు, ఇతర ప్రచార సామాగ్రిని అక్కడకు పంపించారు.
మహారాష్ట్రలో బీఆర్ఎస్కు మంచి ఆదరణ : కేసీఆర్ ఇప్పటికే మూడుసార్లు మహారాష్ట్రలో పర్యటించారు. ఫిబ్రవరి 5న నాందేడ్‌లో, మార్చి 14న కాంధార్ లోహాలో బహిరంగ సభలు నిర్వహించారు. మే 19న మరోసారి నాందేడ్‌లో పర్యటించి పార్టీ సభ్యత్వ కార్యక్రమం ప్రారంభించారు. తెలంగాణ తరహా అభివృద్ధి మహారాష్ట్రలో ఎందుకు జరగదనే ఆలోచన ప్రజల్లో కలిగించాలని అక్కడి నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు.
నాగపూర్‌లోనే ఎందుకు కార్యాలయం : భౌగోళికం పరంగా విదర్భకు ఒక ప్రత్యేకమైన శైలి ఉండడంతో.. రాజకీయంగా కూడా దృష్టి సారించే కేంద్రం అయ్యింది. ఉపాధి, వ్యవసాయం, పరిశ్రమలు, ఖనిజాలు, పర్యాటకం వంటి అనేక అంశాల్లో ముందుంది. అందుకే ఇక్కడ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడానికి కేసీఆర్ ఎంచుకుని ఉండవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణకు సరిహద్దుగా ఉన్న మహారాష్ట్రలో కొన్ని జిల్లాలు తెలంగాణతో సరిహద్దును పెంచుకుంటున్నాయి. అక్కడ తెలుగు ప్రభావం ఉండడంతో ఆ ప్రాంతాలపై కూడా బీఆర్ఎస్ దృష్టి సారించింది.
ఇవీ చదవండి :