Bandi Sanjay On Bhadradri Power Plant: గజ్వేల్, సిద్దిపేట, పాతబస్తీ నుంచి విద్యుత్ బిల్లులు వసూలు చేయడం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. మీటర్లు పెడితే బడా బాబుల ఫాంహౌస్‌లలో విద్యుత్ అక్రమాలు వెలుగుచూస్తాయని తెలిపారు. మీటర్లపై కావాలనే రైతులను తెరాస నేతలు తప్పుదోవ పట్టిస్తోందన్నారు. రూ.3కు కొనే కరెంటును రాష్ట్ర ప్రభుత్వం రూ.6కు కొంటోందన్న బండి... భద్రాద్రి పవర్ ప్లాంట్ అనేది అతిపెద్ద కుంభకోణంగా అభివర్ణించారు. బినామీ వ్యక్తులతో భద్రాద్రి పవర్ ప్లాంట్‌ను నడిపిస్తున్నారని సంజయ్ ఆరోపించారు. గుత్తేదారులతో కుమ్మక్కై రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చిల్లులు పెడుతున్నారని పేర్కొన్నారు. దేశాన్ని విద్యుత్ కష్టాల నుంచి గట్టెక్కించిన ప్రభుత్వం భాజపా అని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిపై కేసీఆర్ ప్రభుత్వం అప్పులు తీసుకున్నారని వివరించారు.
40 గ్రామాలకు వినియోగించే విద్యుత్‌ను సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌కు ఉచితంగా వాడుతున్నారు. ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం అమలు చేసే పరిస్థితి లేదు. ఉచిత విద్యుత్ పేరిట రూ.60వేల కోట్లకు పైగా డిస్కంలను నష్టపరిచారు. రూ.17వేల కోట్లు సింగరేణి సంస్థలకు చెల్లించాలి. ఆ బిల్లులు వసూలు చేయడంలేదు. భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ అతిపెద్ద కుంభకోణం. ఇండియా బుల్స్ వర్కవుట్ కాదని వదిలేస్తే... వేల కోట్లు వెచ్చించి బినామీలకు భద్రాద్రి పనిని అప్పజెప్పారు. -- బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు