BCs Rs 1 Lakh Scheme In Telangana : బీసీలలోని కులవృత్తులు, చేతి వృత్తుల వారి కోసం ప్రభుత్వం అందించేలక్ష రూపాయల ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఈ నెల 6వ తేదీ నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ప్రభుత్వం స్వీకరిస్తుండగా.. అందుకు కావాల్సిన కుల, ఆదాయ ధ్రువ పత్రాలు జత చేయాల్సి వస్తోంది. దీంతో 15రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా తహశీల్దార్ కార్యాలయాలు లబ్ధిదారులతో కిక్కిరిసి పోతున్నాయి.
Rs 1 Lakh To BCs In Telangana : ఆయా కులవృత్తుల వారిలో అత్యధికులకు ఈ ధ్రువపత్రాలు అందుబాటులో ఉండే అవకాశం లేదు. కేవలం విద్య, ఉద్యోగానికి సంబంధించి మాత్రమే విద్యార్థులు తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు బీసీ వర్గాల వారంతా దరఖాస్తుల కోసం కావాల్సిన పత్రాల గురించి.. తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మేరకు ఇవాళ్టితో దరఖాస్తు గడువు ముగియనుంది. దీనితో ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునేందుకు కుల, ఆదాయ, నివాస ధ్రువపత్రాల కోసం ప్రజలు బారులు తీరుతున్నారు. దానికితోడు పాఠశాలలు ప్రారంభం కావడంతో పిల్లల ప్రవేశాల కోసం కావాల్సిన ధ్రువీకరణ పత్రాలు రావడంలో జాప్యం జరుగుతోంది. ఒకేసారి ధ్రువీకరణ పత్రాల కోసం వేల సంఖ్యలో దరఖాస్తులు వస్తుండటంతో.. రెవెన్యూ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
Rs 1 Lakh To BCs Community In Telangana Last Date : తహశీల్దార్ కార్యాలయాల్లోనూ ఆన్‌లైన్ సమస్య కారణంగా తొలి నుంచి ఈ ప్రక్రియ సాఫీగా సాగలేదు. సాయంత్రం నుంచి రాత్రి వరకు సిబ్బంది ఉండి జారీ చేయాల్సి వచ్చింది. ఇటు మీ-సేవా కేంద్రాల్లోనూ ఇదే సమస్య ఎదురవుతోంది. ఇవాళే చివరి రోజు కావటంతో తహశీల్దార్ కార్యాలయాలు, మీసేవల వద్ద బారులు తీరారు. మీ-సేవ కేంద్రాల్లో రద్దీ పెరగడంతో సర్వర్ సమస్య తలెత్తుతోంది. గంటలకొద్ది కేంద్రాల వద్ద వేచి ఉంటున్నారు. ధ్రువీకరణపత్రాలకు దరఖాస్తు చేసుకున్న తర్వాత వాటిని తహశీల్దార్ కార్యాలయం నుంచి పొందాల్సి ఉండటంతో.. తీవ్ర కష్టాలు పడాల్సి వస్తోంది. ప్రభుత్వం విధించిన గడువు ఈరోజుతో ముగిస్తుండడంతో వారు ఆందోళన చెందుతున్నారు.