Bathukamma celebrations in Telangana: తెలంగాణ రాష్ట్ర పండుగ 'బతుకమ్మ' ఉత్సవాల ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఆడబిడ్డలు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడుతూ పాడుతూ ఆనందోత్సాహాల నడుమ జరిగే వేడుకలు పల్లెల్లో ప్రత్యేకతను చాటుతాయన్నారు. బతుకమ్మ పండుగను జరుపుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని సీఎం తెలిపారు. బతుకమ్మ ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలు, ఆడపడుచులకు మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ శుభాకాంక్షలు తెలిపారు.
మహబూబ్‌నగర్:పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో అట్టహాసంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. మహిళలతో కలిసి జడ్చర్ల ఎమ్మెల్యే లక్షారెడ్డి మహిళలతో కలిసి దాండియా నృత్యం చేశారు.
ఆదిలాబాద్:జిల్లాలో సఖి కేంద్రంలో ముందస్తు బతుకమ్మ వేడుకలు కోలాహలంగా సాగాయి. కలెక్టర్ సిక్తా పట్నాయక్ అంగన్వాడీ కార్యకర్తలు, కళాశాల విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో బొడ్డెమ్మ వేడుకలను మహిళలు సందడిగా జరుపుకున్నారు. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చిన మహిళలు ఆటాపాటలతో సందడి చేశారు. పాఠశాలలకు దసరా సెలవులు సందర్భంగా ఖమ్మం జిల్లా వైరాలో చివరి రోజు విద్యార్థులు బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు.