loans: కరోనా సంక్షోభంతో చాలా పరిశ్రమలు నష్టాల్లో కూరుకుపోయాయి. వీటిపై అపనమ్మకంతో బ్యాంకులు సాయం చేయడానికి వెనుకాడుతున్నాయి. గతంలో భూముల తనఖాపై అప్పులు ఇచ్చేవి. 2020 నుంచి భూములు చూపినా రుణాలివ్వడం లేదు. పారిశ్రామిక ఆస్తులనూ పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఇళ్లు, ఇతర విలువైన ఆస్తులను మాత్రమే పూచీకత్తుగా అంగీకరిస్తున్నాయి. సాధారణంగా బ్యాంకులు చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఏటా 20 శాతం, సూక్ష్మ పరిశ్రమలకు 10 శాతం రుణాలు పెంచాల్సి ఉంది. 2020- 21 ఆర్థిక సంవత్సరంలో అవి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రూ. 39,351 కోట్లకు గాను, రూ. 21,426 కోట్లు మాత్రమే రుణాలిచ్చాయి. సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు పూచీకత్తు లేకుండా రూ. 2 కోట్ల వరకు రుణసాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్టు ఫర్ మైక్రో, స్మాల్ ఇండస్ట్రీస్ (సీజీటీఎంఎస్ఈ) పథకాన్ని అమలు చేస్తోంది. దీని కింద 2020-21లో 1449 మందికి మాత్రమే రూ. 185 కోట్ల సాయం మంజూరైంది. అదీ విడుదల కావాల్సి ఉంది.
*సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సమూహాల (క్లస్టర్ల)కు రుణ సాయం చేసేందుకు కేంద్రం నిర్దేశించింది. తెలంగాణలో 5,169 సమూహాలుండగా. అందులో 3,861 సమూహాల్లోని పరిశ్రమలకు మాత్రమే కొద్దిపాటి రుణసాయం అందింది.
*కరోనా కాలంలో రుణ వాయిదాలను చెల్లించని 1,57,034 పరిశ్రమలను బ్యాంకులు నిరర్థక ఆస్తులుగా ప్రకటించాయి. దాదాపు రూ.7,184 కోట్ల మేర బకాయిలున్న వీటి జప్తునకు సన్నాహాలు జరుగుతున్నాయని పారిశ్రామికవేత్తలు ఆందోళన చెందుతున్నారు.
*రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ చిన్నతరహా పారిశ్రామికవేత్త.. కరోనాతో పరిశ్రమ నిర్వహణ కష్టంగా మారడంతో... రుణసాయం కోసం బ్యాంకులను సంప్రదించారు. పాత బకాయిలు చెల్లిస్తేనే అప్పు ఇస్తామని బ్యాంకు తిరస్కరించింది.
*మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు చెందిన ఓ ఔత్సాహిక పారిశ్రామికవేత్త బీటెక్ పూర్తి చేసి కొత్తగా విద్యుత్తు పరికరాల తయారీ పరిశ్రమ స్థాపించాలని బ్యాంకు అధికారులను కలిశారు. రూ. 2 కోట్ల వరకు పూచీకత్తు లేకుండా సాయం అందించాల్సి ఉన్నా, రుణమివ్వడానికి బ్యాంకు ముందుకు రాలేదు.
* కేంద్రప్రభుత్వం తెచ్చిన అత్యవసర పరపతి పూచీ పథకం కింద 2,16,267 మంది పారిశ్రామికవేత్తలు దరఖాస్తు చేసుకోగా.. 87,516 మందికి మాత్రమే రుణాలు మంజూరయ్యాయి.