బంజారాహిల్స్ రోడ్డు ప్రమాదంలో పోలీసుల ఉదాసీనత police negligence:హైదరాబాద్ వ్యాప్తంగా 3.18 లక్షల సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని... వాటితో నేరం జరిగిన నిమిషాలు, గంటల్లోనే నిందితులను పట్టుకుంటున్నామని పోలీసులు ఎప్పుడూ చెప్పే మాట. కానీ దానికి భిన్నంగా బంజారాహిల్స్ పోలీసులు వింతగా ప్రవర్తిస్తున్నారు. అయోధ్యరాయ్, దేబేంద్రదాస్... బంజారా హిల్స్ రెయిన్‌బో చిన్నపిల్లల ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి దాటాక వాళ్లిద్దరూ బయటకు వచ్చి టీ తాగారు. మళ్లీ ఆసుపత్రికి వెళ్తుండగా బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లో ఓ కారు వేగంగా వచ్చి వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారిద్దరూ మరణించారు.
ఒక్కటంటే ఒక్క సీసీటీవీ కెమెరాలో కారు లేదు..
వారిని ఢీకొట్టిన కారులో ఉన్న రోహిత్‌గౌడ్, సాయి సోమన్ ప్రమాదం తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. ఈ దుర్ఘటనకు సంబంధించి ఇప్పటి వరకూ సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు సేకరించలేదు. రోడ్డు ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన సాక్షుల్లేరు. ప్రమాదం జరిగిన చోట కెమెరాలేదు. ఇంతే కాదు.. మద్యం మత్తులో కారు నడిపిన రోహిత్‌గౌడ్, సాయి సోమన్‌లు ఎటునుంచి ఎటు వెళ్తున్నారో కూడా పోలీసులకు తెలియదు. వారు బయలుదేరిన చోటు నుంచి పోలీసులు అదుపులోకి తీసుకునేంత వరకు కనీసం ఒక్కటంటే ఒక్క సీసీటీవీ కెమెరాలోనూ రోహిత్ నడిపిన కారు కన్పించలేదు మరి.
ఎటునుంచి వచ్చారో తెలీదంటున్న పోలీసులు..
బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్‌లో ఆదివారం అర్ధరాత్రి నలుగురు మిత్రులు మద్యం తాగినట్టు హోటల్ వద్ద సీసీటీవీ ఫుటేజీలున్నాయి. హోటల్ వద్ద ఇద్దరు ఆగిపోగా... రోహిత్, సోమన్‌లు పోర్ష్ కారులో బయటకు వచ్చారు. వారిద్దరూ ప్రమాదం జరిగిన చోటుకు ఎటునుంచి వచ్చారో పోలీసులు తెలీదంటున్నారు. బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్ నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 5, వెంకటగిరి వరకు రోహిత్, సోమన్‌లు ఐదు కిలోమీటర్లు తిరిగారు. ఈ 5 కిలోమీటర్లలో ఒక్క చోటా కూడా సీసీటీవీ కెమెరా లేదా? పోలీసులకు ఫుటేజీలు కనిపించలేదా? అనేది అర్థం కావడంలేదు.
పోలీసుల ఉదాసీనత..
నేరాల నియంత్రణలో బంజారాహిల్స్ పోలీసులు ఉదాసీనంగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతనెల 14న కేబీఆర్ పార్కు వద్ద నటి చౌరాసియాపై నిందితుడు బాబు అసభ్యంగా ప్రవర్తిస్తే.. ఈ ఘటనను బయటకు పొక్కకుండా రహస్యంగా ఉంచేందుకు ప్రయత్నించారు. ఈ కేసులోనూ సీసీటీవీ కెమెరాలు లేవంటూ దర్యాప్తును పట్టించుకోలేదు. సీపీ అంజనీకుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినా... నిందితుడిని గుర్తించేందుకు ఆపసోపాలు పడ్డారు. చివరకు ఉత్తరమండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు బాబును అరెస్ట్ చేశారు. కేబీఆర్ పార్క్ లోపల, బయట కెమెరాలు ఏర్పాటు చేయించుకోవాలంటూ పోలీసులు ఏమాత్రం ఒత్తిడి చేయడం లేదు. ఇంతేకాదు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2, రోడ్ నంబర్ 3లో బహుళ అంతస్తుల భవనాలు, షాపింగ్ మాల్స్, వాణిజ్య సముదాయాలున్న ప్రాంతాల్లో ... రోడ్డు కనిపించేలా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలంటూ వాణిజ్య సముదాయాలను బంజారాహిల్స్ పోలీసులు అడగడం లేదు.
ఇదీ చదవండి:Farmer dead at IKP center: గుండెపోటుతో ధాన్యం కుప్పపైనే ప్రాణం విడిచిన రైతు