Bandi Sanjay comments on KCR: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ నోటీసుల జారీ పేరుతో ప్రతిపక్ష పార్టీల నేతల నోరు నొక్కేసే కుట్రకు ముఖ్యమంత్రి కేసీఆర్ తెర దీశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. కుట్రకు కారణం అయిన వారిని వదిలేసి ప్రతిపక్షాలకు నోటీసులు ఇవ్వడం సిగ్గుచేటని మండిపడ్డారు. సిట్ నోటీసులకు, విచారణకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నోటీసుల పేరుతో ప్రతిపక్షాలను దాడులు, నిషేధం పేరుతో ప్రశ్నించే మీడియా సంస్థల గొంతును అణిచివేసే కుట్ర జరుగుతోందని అయన విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో ఇదే పంధాతో రెచ్చిపోయిన హిట్లర్, ఇందిరాగాంధీ వంటి నియంతలనే మట్టి కరిపించిన చరిత్ర ప్రజలకుందని గుర్తుచేశారు.
కేటీఆర్ నాపై ఆరోపణలు చేశారు: సంజయ్:కేసీఆర్ సర్కార్‌కు సైతం అదే గతి పడుతుందనే విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిదన్నారు. ఆధారాలు సమర్పించాలని కోరేందుకే సిట్ నోటీసులు జారీ చేసినట్లు చెబుతున్నారని అదే నిజమైతే సిట్‌కు నిబద్ధత ఉంటే పేపర్ లీకేజీ కుట్ర వెనుక బండి సంజయ్ పాత్ర ఉన్నట్లు కేసీఆర్ కుమారుడు కేటీఆర్ నాపై ఆరోపణలు చేశారని తెలిపారు. ఆ ఆరోపణలకు సంబంధించి ఆధారాలు సమర్పించాలని కేసీఆర్ కుమారుడికి నోటీసులు జారీ చేసే దమ్ము సిట్‌కు ఉందా అని ప్రశ్నించారు. కేటీఆర్‌ను పిలిచి విచారించే ధైర్యముందా అని నిలదీశారు.