Bandi sanjay criticise brs government: హైదరాబాద్లోని కాచిగూడలో భారతీయ మజ్దూర్ సంఘ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్టీసీ కార్మికుల ఆత్మీయ సమ్మేళనంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని.. కార్మికులందరూ తెలంగాణ ఉద్యమం నాటి తెగువను చూపి.. కేసీఆర్ పాలనకు చరమగీతం పాడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
సింగరేణి, విద్యుత్, ఆర్టీసీ ఉద్యోగులంతా ఏకం కావాలని తెలిపారు. మరో ఐదు నెలల్లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేసిన ఆయన.. తొలగించిన ఉద్యోగులందరిని విధుల్లోకి తీసుకుంటామని.. బడ్జెట్‌లో ఆర్టీసీకి ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామని వివరించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. భయపడితే ముఖ్యమంత్రి మరింత భయపెడతారని... ఆర్టీసీ కార్మికులు తలుచుకుంటే ప్రభుత్వం పని ఖతమవుతుందని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఉచిత కరెంట్ ఇవ్వడం మంచిదే కానీ.. కేసీఆర్ డిస్కంలకు కట్టాల్సిన డబ్బులు ఎందుకు కట్టడం లేదని ప్రశ్నించారు. ప్రస్తుతం డిస్కంలు 60వేల కోట్ల నష్టాల్లో ఉన్నట్లు గుర్తుచేశారు. సింగరేణి సంస్థ కేసీఆర్ కుటుంబానికి ఏటీఏంలా తయారైందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ పథకాలలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు దళిత బంధులో 30శాతం కమిషన్ తీసుకున్నారని ముఖ్యమంత్రే స్వయంగా చెప్పినట్లు ఆరోపించారు. దీన్ని బట్టే రాష్ట్రంలో కేసీఆర్ పాలన ఎలా ఉందో అర్థమవుతుందని విమర్శించారు.