Bandi Sanjay Comments on Asaduddin Owaisi : ఎంఐఎం పార్టీకి ఉగ్రవాదులకు సంబంధం ఉందో లేదో అసదుద్దీన్ ఓవైసీ చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఐసిస్ వాళ్లకు అన్ని రకాలుగా సాయం చేస్తానని ఓవైసీ గతంలో ప్రకటించారని గుర్తు చేశారు. ఉగ్రవాదులతో సంబంధం ఉన్న వాళ్లకు ఆయన తన ఆస్పత్రుల్లో ఉద్యోగాలు ఇచ్చారని పేర్కొన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు
నిన్న అరెస్టైన సలీం.. ఒవైసీకి చెందిన డెక్కన్ మెడికల్ కాలేజీలో శాఖాధిపతిగా పనిచేస్తుండటమే ఇందుకు నిదర్శనమని బండి సంజయ్ పేర్కొన్నారు. ఉగ్రవాదులకు పాతబస్తీ అడ్డాగా మారిందని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లో నేరాలు చేసి వచ్చి ఇక్కడ తలదాచుకుంటున్నారని ఆక్షేపించారు. రాజకీయ అవసరం కోసం ఎంఐఎం పార్టీని కాంగ్రెస్, బీఆర్ఎస్ వాడుకుంటున్నాయని దుయ్యబట్టారు. పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌కు చెందిన పలువురు వ్యక్తులు పాతబస్తీలో ఉన్నారని బండి సంజయ్ వివరించారు.
హైదరాబాద్ ప్రజల ప్రాణాలు బాంబుల కింద ఉన్నాయని బండి సంజయ్ తెలిపారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. కానీ వారి ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశం కూడా సీఎం కేసీఆర్‌కు లేదని మండిపడ్డారు. ఎంఐఎం సహకారంతో కొత్త లవ్ జిహాదీని బీఆర్ఎస్ ప్రోత్సహిస్తోందని విమర్శించారు. ధర్మాన్ని కాపాడే బజరంగ్ దళ్ మీద నిషేధం విధిస్తామని కర్ణాటకలో కాంగ్రెస్ చెప్పిందని అన్నారు. నిన్న ఐదుగురు ఇస్లామిక్ రాడికల్స్ హైదరాబాద్‌లో దొరికితే ముఖ్యమంత్రి సమీక్ష చేయలేదని బండి సంజయ్ ఆక్షేపించారు.
ఉగ్రవాదులకు రెండో అడ్డా హైదరాబాద్ : పాకిస్థాన్ తర్వాత ఉగ్రవాదులకు రెండో అడ్డా హైదరాబాద్ మాత్రమేనని బండి సంజయ్ పేర్కొన్నారు. శాంతిభద్రతలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయని అన్నారు. రాష్ట్ర పోలీసుల సహకారం లేనిదే కేంద్రం ఏమీ చేయలేదని తెలిపారు. ఈ క్రమంలోనే హైకోర్టు చివాట్లు పెట్టిన వ్యక్తికి చీఫ్ అడ్వయిజర్ పదవిస్తారా అని ప్రశ్నించారు. జేపీఎస్‌ల సమ్మెకు పూర్తి మద్దతిస్తున్నామని.. వారికి అండగా ఉంటామని చెప్పారు. కర్నాటక ఎన్నికల్లో మళ్లీ అధికారం చేపట్టేది బీజేపీని అని స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వానికి దమ్ముంటే ఓఆర్ఆర్ లీజుపై సీబీఐ విచారణ జరపాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.