Balkampet Renuka Ellamma Kalyanotsavam 2023 : ఏటా ఆషాఢమాసం మొదటి మంగళవారం నిర్వహించేబల్కంపేట రేణుక ఎల్లమ్మ కల్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. జంటనగరాలతో పాటు ఇతర జిల్లాలు, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భక్తులు లక్షల సంఖ్యలో హాజరయ్యారు. మంత్రితలసాని శ్రీనివాస్‌యాదవ్‌కుటుంబసభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించగా, సీఎస్ శాంతి కుమారి తలంబ్రాలు అందించారు. ఆలయ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు.. బల్కంపేట రహదారిని పూర్తిగా మూసివేశారు.
రేణుక ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. అందుకు తగిన ఏర్పాట్లను పోలీసులు చేసిన.. ఇంకా ఎక్కువ సంఖ్యలో భక్తులు రావడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గంటల కొద్దీ లైన్లను ముందుకు కదలనివ్వకపోవటంతో మహిళలు అసహనానికి గురయ్యారు. దీనితో అక్కడ ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటను నియంత్రించకుండా పోలీసులు ఉన్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ దశలో రద్దీని నియంత్రించాల్సిన పోలీసులే.. ప్రేక్షక పాత్ర వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
"బల్కంపేట రేణుక ఎల్లమ్మ కల్యాణం చాలా ఘనంగా జరుగుతుంది. ప్రతి ఏడాది మేము వస్తాము. అమ్మవారిని నమ్మినవారందరూ చాలా ఆనందంగా, సుఖసంతోషాలతో ఉంటారు. ఏర్పాట్లు మాత్రం కొంచెం బాగోలేవు. ఆడవారికి, పురుషులకు వేర్వేరు లైన్లు ఉంటే బాగుంటుంది. వీఐపీ, వీవీఐపీ టిక్కెట్లనే ఎక్కువ ఇచ్చారు. దర్శనం చాలా ఆలస్యంగా సాగుతోంది." - భక్తులు