అడవుల సంరక్షణే ధ్యేయంగా అటవీశాఖ 'అటవీ ప్రాంతాలన్నీ సురక్షితంగా ఉండాలి. ఒక్క చెట్టూ కొట్టడానికి వీల్లేదు.' ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ అటవీ శాఖ అధికారులకు చేసిన ఆదేశం. జంగిల్ బచావో, జంగిల్ బడావో నినాదంతో ముందుకెళ్లాలనే సీఎం సూచనల మేరకు అటవీశాఖ చర్యలు వేగవంతం చేసింది. అడువుల సంరక్షణే ధ్యేయంగా కొత్తగా ఎంపికైన శాసనసభ్యులు, సర్పంచ్లతో ఫారెస్టు అధికారులు సమావేశం కావాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.
నాలుగు విడతల్లో హరితహారం కింద చేపట్టిన పనుల వివరాలు, గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత కోసం చేయాల్సిన పనులను ప్రజాప్రతినిధులకు వివరిస్తారు. పచ్చదనం కోసం పాటుపడే గ్రామాలకు, వ్యక్తులకు ప్రభుత్వం ఇస్తున్న హరితమిత్ర అవార్డులు, రివార్డులపై అవగాహన కల్పిస్తారు.
అటవీ ప్రాంతాల సరిహద్దుల ఏర్పాటు, ఆక్రమణల నియంత్రణ, క్షీణించిన అడవుల పునరుజ్జీవనం, పట్టణాల్లో అర్బన్ ఫారెస్ట్ పార్కుల ఏర్పాటు తదితర అంశాలను ప్రజాప్రతినిధులకు తెలియజేస్తారు. గ్రామాల వారీగా అటవీ రక్షణ కమిటీల ఏర్పాటు ప్రాధాన్యతను వివరిస్తారు. కొత్త చెక్ పోస్టుల ఏర్పాటు, పోలీసు, రెవెన్యూ అధికారులతో సమన్వయం, అటవీ రక్షణలో ప్రజలు, ప్రజా ప్రతినిధుల విధులపై చర్చిస్తారు. కలప అక్రమరవాణా, వేట నియంత్రణ కోసం సహకరిస్తూ, ఎలాంటి సమాచారం ఉన్న సంబంధిత అధికారులకు తెలియచేయాల్సిందిగా కోరుతారు.
పంచాయతీల పాలక మండళ్లు కొలువుదీరిన నేపథ్యంలో బాధ్యతలు చేపట్టిన రోజుకు గుర్తుగా వివిధ ప్రాంతాల్లో సర్పంచ్ల చేత అటవీ సిబ్బంది మొక్కలు నాటించారు. వాటి పెంపు బాధ్యతను పర్యవేక్షించాల్సిందిగా కోరారు. కలపకోత యంత్రాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. ప్రతి కలపకోత యంత్రం తప్పని సరిగా స్టాక్ రిజిస్టర్ ఏర్పాటుచేసి, అందులో కలప వివరాలు నమోదు చేయాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశించారు