రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ పథకం మంచి ఫలితాలు సాధిస్తోంది. ఈ పథకం కింద ఇప్పటివరకు 9,31,531 ప్రసవాలు జరిగాయి. 3 సంవత్సరాల 3 నెలల కాలంలోనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల శాతం 30 నుంచి 50 శాతానికి పెరిగింది. దేశంలోనే ప్రసూతి మరణాలు గణనీయంగా తగ్గిన రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. 2017 జూన్ 3న ఈ పథకాన్ని ప్రారంభించగా.. 2020 సెప్టెంబరు 13 నాటికి రాష్ట్రంలో 7,53,927 కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు. గర్భిణులకు వేర్వేరు దశల్లో ఇప్పటి వరకూ రూ.990.26 కోట్లను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. కేసీఆర్ కిట్ పథకం అమలు తీరుపై వైద్యఆరోగ్యశాఖ ప్రగతి నివేదికను విడుదల చేసింది. పథకం సాధించిన ఘనతలను అంశాల వారీగా వివరించింది.
అన్ని దశల్లో అండగా..
- కేసీఆర్ కిట్ పథకం కింద నమోదు చేసుకున్న మహిళకు దశల వారీగా రూ.12 వేలు (ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు) జమ చేస్తోంది.
- గర్భిణి సమయంలో వైద్యుల సంప్రదింపులకు, ప్రసవానంతరం ఇంటికి వెళ్లేటప్పుడు, చిన్నారికి టీకాల కోసం ఆసుపత్రులకు ఉచితంగా రాకపోకలు కొనసాగించేందుకు వీలుగా 300 ‘అమ్మఒడి(102)’ వాహనాలను ప్రవేశపెట్టింది.
- ప్రసవ తేదీని గర్భిణికి ప్రభుత్వ వైద్యసిబ్బంది ముందస్తుగానే గుర్తు చేస్తూ వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి సమీపంలోని సర్కారు దవాఖానాలో ప్రసవానికి తీసుకెళ్తున్నారు.
- కాన్పు సమయంలో ఎలాంటి ఇన్‌ఫెక్షన్లు సోకకుండా ఉండేందుకు రూ.28.46 కోట్లతో 305 ప్రసవ గదులను ఆధునికీకరించింది.
- 22 మాతాశిశు సంరక్షణ ఆసుపత్రులను కొత్తగా నిర్మించేందుకు రూ.407 కోట్లను మంజూరు చేసింది. వీటిలో ఇప్పటికే 9 ఆసుపత్రులను ప్రారంభించింది. తద్వారా 1350 పడకలు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. వీటికి అనుగుణంగా వైద్యసిబ్బందిని నియమించింది.
- ప్రసవానంతరం మహిళలకు రూ.2 వేల విలువ కలిగిన 15 వస్తువులతో కూడిన కిట్‌ను అందిస్తోంది.