కరోనా రెండోదశ రాష్ట్రంపై తీవ్ర ప్రభావమే చూపిస్తోంది. మహమ్మారిని తుదముట్టించేందుకు రాత్రి కర్ఫ్యూ పకడ్బందీగా అమలుచేస్తున్నా... వైరస్ వ్యాప్తి ఏ మాత్రం ఆగడం లేదు. నిజామాబాద్ జిల్లా నవీపేట గ్రామ మాజీ వార్డు సభ్యురాలు కొవిడ్ సోకగా... ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె భౌతికదేహాన్ని జేసీబీలో తరలించి... పంచాయతీ సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి దహన సంస్కారాలు నిర్వహించారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పోతారంలో కరోనాకు... ఓ ప్రైవేట్ ఉపాధ్యాయుడు బలయ్యారు. అంత్యక్రియల నిర్వహణకు ఎవరూ ముందుకు రాకపోవడం వల్ల...జేసీబీ సాయంతో పంచాయతీ సిబ్బంది ఆఖరి తంతు పూర్తి చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూరలో రెండురోజుల క్రితం ఓ వృద్ధురాలికి కోవిడ్ సోకగా ఏమవుతుందోననే భయంతో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది.
పీజీ వైద్య పరీక్షలు వాయిదా?
కరోనా కట్టడి కోసం ప్రజలంతా సహకరిస్తేనే సాధ్యమవుతుందని మహబూబ్‌నగర్ ఎస్పీ వెంకటేశ్వర్లు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రైతు బజార్ కూడలిలో కోవిడ్ నిబంధనలపై అవగాహన కల్పించిన ఆయన... అపోహలు మాని ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని సూచించారు. కొవిడ్ ఉద్ధృతి దృష్ట్యా మే 5 నుంచి జరగాల్సిన పీజీ వైద్య పరీక్షలను వాయిదా వేయాలని జూనియర్ వైద్యులు... కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతికి విన్నవించారు. ఆదిలాబాద్ జిల్లాలో కరోనా పరీక్షల పేరిట దోపిడీ జరుగుతోంది. ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్లో కంటే మెరుగైన ఫలితం వస్తోందంటూ సీటీ స్కానింగ్‌లు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇదే అదనుగా ఒక్కో సీటీ స్కానింగ్‌కు 5 వేల బిల్లువేస్తూ ప్రజలను నిలువునా దోచుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.