తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆటోడ్రైవర్ల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా..: రేవంత్ - తెలంగాణ వార్తలు

Auto Drivers Met Revanth reddy : ఆటోడ్రైవర్ల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇతర ప్రాంతాల ఆటోలను గ్రేటర్‌లో తిరగనివ్వట్లేదని ఆవేదన చెందుతూ... డ్రైవర్లు రేవంత్​ను కలిశారు.

Auto Drivers Met Revanth reddy, auto drivers  problems
ఆటోడ్రైవర్ల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా..: రేవంత్

By

Published : Feb 26, 2022, 4:44 PM IST

Updated : Feb 26, 2022, 7:20 PM IST

Auto Drivers Met Revanth reddy : జిల్లాలకు చెందిన ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు.... కృషి చేస్తానని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇతర ప్రాంతాల ఆటో డ్రైవర్లు... రేవంత్‌ రెడ్డిని కలిశారు. గ్రేటర్ హైదరాబాద్​లో ఇతర జిల్లాలకు చెందిన ఆటోలను తిరగనివ్వడంలేదని.. రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. నల్గొండ, యాదాద్రి భువనగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి జిల్లాలకు చెందిన ఆటోలను నగరంలోకి అనుమతించడంలేదని వాపోయారు. ఇతర రాష్ట్రాల వాహనాలు తిరుగుతున్నప్పుడు పట్టించుకోని అధికారులు.. నగరానికి ఆనుకుని ఉన్న జిల్లాల నుంచి వచ్చే ఆటోలను ఎందుకు అనుమతించడలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ల సమస్యలు... ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.

డ్రైవర్ల ఆందోళన

Auto Drivers Protest: నల్గొండ, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన కొంతమంది తమ ఆటోలను నగరంలోకి అనుమతించాలని డిమాండ్ చేస్తూ సాగర్​ రింగ్​ రోడ్డు సమీపంలో శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. గ్రామాల్లో పని లేకపోవడంతో కొన్నేళ్లుగా నగరంలోనే ఆటో నడుపుతూ జీవనం గడుపుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు జిల్లాల నుంచి తీసుకొచ్చిన ఆటోలను నగరంలో తిరగకూడదని ఆదేశాలు జారీ చేస్తే తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలని వాపోతున్నారు. తమ పర్మినెంట్ చిరునామా గ్రామాల్లో ఉండటంతో అక్కడి అడ్రస్ మీదనే ఆటోలు కొనుగోలు చేసి, ఆర్టీఏ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని వారు వెల్లడించారు.

'అవి ఎందుకు అతికించారు?'

Auto drivers problems : తమ ఆటోలకు నగరంలో అనుమతి లేనప్పుడు అధికారులు మీటర్ రీడింగ్ సీజింగ్​తో పాటు సీరియల్ నంబర్ ఇచ్చి స్టిక్కర్లు ఎందుకు అతికించారని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాలు, దేశాల వాహనాలు తిరుగుతున్నా పట్టించుకోని అధికారులు నగరానికి ఆనుకోని ఉన్న జిల్లాల నుంచి వచ్చే ఆటోలను అనుమతి ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఇతర జిల్లాల ఆటోలకు అనుమతి ఉండదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత మూడేళ్లుగా కరోనాతో కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయని, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆటో కార్మికులను ఇబ్బంది పెట్టడం దారుణమన్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం పట్టించుకొని తమ ఆటోలను నగరంలో తిరగనివ్వాలని.. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఇదీ చదవండి :'ఉద్యోగాలు వెతుక్కునే వారిలా కాదు.. కల్పించేలా మారాలి'

Last Updated : Feb 26, 2022, 7:20 PM IST

ABOUT THE AUTHOR

...view details