DTR Meters not Started in Telangana : తెలంగాణలో వ్యవసాయ బోర్లకు విద్యుత్ సరఫరా చేసే పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్ల (డీటీఆర్) వద్ద మీటర్ల ఏర్పాట్లు ఇంకా ప్రారంభం కాలేదు. ‘రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి’ (ఈఆర్‌సీ) 2022 మార్చి నెలాఖరులోగా మీటర్ల ఏర్పాటు పనులు ప్రారంభించాలని ఆదేశించినా విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లలో ఎలాంటి స్పందన లేదు. ఈ ఏడాది మార్చి ముగిసినా ఇంతవరకూ కనీసం మీటర్ల కొనుగోలు కూడా ప్రారంభించలేదు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని వ్యవసాయ డీటీఆర్‌లకు ఇప్పటికిప్పుడు మీటర్లు పెట్టాలంటే రూ.98 కోట్లు అవసరమని, అన్ని నిధులు లేనందున ఆర్‌ఈసీని రుణం అడిగినట్లు డిస్కంలు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి తెలిపాయి. ఇదిలా ఉంటే ఇప్పటివరకు రాష్ట్రంలో ఎన్ని డీటీఆర్‌లకు మీటర్లు పెట్టారనే వివరాలు ఇవ్వాలని తాజాగా డిస్కంలకు ఈఆర్‌సీ లేఖ రాసింది. తెలంగాణ ఏర్పడిన 2014-15లో 18 లక్షల వ్యవసాయ బోర్లకు కరెంటు కనెక్షన్లుండగా 11,671.24 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగమైంది. కానీ రాష్ట్రంలో 2022-23లో బోర్ల కనెక్షన్ల సంఖ్య 27 లక్షలు దాటడంతో వినియోగం 20 వేల మి.యూ.లు దాటిపోయినట్లు డిస్కంలు అంచనా వేస్తున్నాయి. బోర్ల వద్ద గానీ, డీటీఆర్‌ల వద్ద కానీ మీటర్లు లేకుండా ఎలా కచ్చితంగా ఈ యూనిట్ల లెక్కలను అంచనా వేస్తారని ఈఆర్‌సీ ప్రశ్నిస్తోంది.