రాష్ట్రంలో ఇక ఏ జబ్బుతో ఆసుపత్రికెళ్లినా ఆరోగ్యశ్రీ వర్తించేలా వైద్య ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న సుమారు లక్ష మంది విద్యార్థులకు ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించాలని నిర్ణయించింది. ఆ ఒప్పందాన్ని గిరిజన సంక్షేమ శాఖతో త్వరలో కుదుర్చుకోనుంది. రాష్ట్రంలో ఇప్పటికే బోదకాలు, హెచ్‌ఐవీ బాధితులకు పింఛను విధానాన్ని అమలు చేస్తుండగా.. కుష్టు, కిడ్నీ వైఫల్య బాధితులకూ పింఛను పథకాన్ని వర్తింపజేయాలని తాజాగా ప్రతిపాదనలు రూపొందించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదంతో త్వరలోనే తాజా నిర్ణయాలను అమల్లోకి తీసుకురానున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి.
నమోదవని రోగాలను జాబితా నుంచి తొలగింపు
ఆరోగ్యశ్రీ కింద ప్రస్తుతం సుమారు వెయ్యికి పైగా జబ్బులకు చికిత్స అందిస్తున్నారు. వీటిలో సుమారు 200 వరకే దాదాపు 70శాతం చికిత్సలు పొందుతున్నట్లుగా నమోదవుతున్నాయి. ఇప్పటివరకు సుమారు 100 వరకు జబ్బులకు ఒక్కసారి కూడా ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించినట్లుగా గత పదేళ్లలో నమోదవలేదు. ఇలా ఒక్కసారి కూడా చికిత్సకు నమోదవని జబ్బులను ఆరోగ్యశ్రీ పరిధి నుంచి తొలగించాలని వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు కొందరు ఇటీవల వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో ప్రతిపాదించారు.
పలు రకాల రోగులు, చర్చలు
మూత్రపిండాల వైఫల్యంతో చికిత్సకు వస్తే.. రోగికి అప్పటి పరిస్థితుల దృష్ట్యా రక్తశుద్ధి (డయాలసిస్) అవసరం లేకపోవచ్చు. ఇప్పుడున్న ఆరోగ్యశ్రీ నిబంధనల ప్రకారం రక్తశుద్ధి చికిత్స పొందితేనే.. ఆ రోగికి ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. మరికొంతకాలం ఆ రోగి రక్తశుద్ధి చికిత్స వరకు తన అనారోగ్యం దిగజారకుండా కాపాడుకోవడానికి సాధారణ మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ వర్తింపజేయకపోతే ఆ రోగి ఆరోగ్యం విషమంగా మారే అవకాశాలు ఉన్నాయి.