విభిన్న చారిత్రక నిర్మాణాలకు నెలవైన గోల్కొండ కోట సమీపంలోని నయాఖిల్లా ప్రాంతం అడుగున మరో నగరం ఉండేదా? అంటే అవుననే అంటున్నారు పురావస్తు నిపుణులు. ప్రస్తుత తవ్వకాల్లో బయటపడ్డ అవశేషాలను పరిశీలిస్తే అలాగే అనిపిస్తోందని చెబుతున్నారు. తాజాగా ఇక్కడ రెండు అడుగుల మేర తవ్వగానే.. పలు ఆనవాళ్లు వెలుగులోకి వచ్చాయి. గోల్కొండ కోటకు కిలోమీటరు దూరంలో ఉన్న నయా ఖిల్లా కూడా చారిత్రక నిర్మాణాలకు వేదికగా నిలుస్తోంది. ఇక్కడ దాదాపు 500 ఏళ్ల నాటి బూరుగు వృక్షం, ముల్లాఖయాలీ, ముస్తఫాఖాన్ మసీదులు ఇప్పటికీ ఉన్నాయి. గతంలో మొఘల్‌గార్డెన్ ఉండేదని చరిత్రకారులు చెబుతున్నారు. మొఘల్‌గార్డెన్ ఉండేదని చెప్పుకొనే ప్రదేశంలోనే కేంద్ర పురావస్తు శాఖ అధికారులు గత పదిరోజులుగా తవ్వకాలు జరుపుతుండగా.. ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి.
రెండు అడుగుల లోతులోనే అనేక ఆనవాళ్లు...
నయా ఖిల్లా దగ్గర దాదాపు 50 నుంచి 70 వరకు గుంతలను రెండు అడుగుల లోతు వరకు తవ్వారు. ఈ సందర్భంగా పెద్దపెద్ద రాళ్లతో కట్టిన నిర్మాణాలు బయటపడుతున్నాయి. ఓ చోట దాదాపు అర కిలోమీటరు మేర బండరాళ్ల వరుస బయటపడింది. గది లాంటి నిర్మాణం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం తవ్వకాలు జరుపుతున్న స్థలం కుడివైపున కూడా మరిన్ని తవ్వకాలు జరిపేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రెండు అడుగుల లోతులో తవ్వితేనే ఇలాంటి నిర్మాణాలు వెలుగుచూస్తే.. అదే పది, పన్నెండు అడుగుల మేర తవ్వితే మరిన్ని భారీ నిర్మాణాలు బయటపడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.