హైదరాబాద్ అమీర్‌పేట్ పాస్‌పోర్టు సేవా కేంద్రం వద్ద.. దరఖాస్తుదారులు ధర్నా చేపట్టారు. సర్వర్‌లు మొరాయించడంతో దరఖాస్తుల ప్రక్రియ నిలిచిపోయింది. ఉదయం నుంచి గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. దీనితో పాస్ పోర్టు కార్యాలయ సిబ్బందిపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సహనం కోల్పోయి అధికారులతో వాగ్వాదానికి దిగారు. కార్యాలయ సిబ్బంది వారికి సర్ది చెప్పారు.
దేశవ్యాప్తంగా పాస్ పోర్ట్ కార్యాలయాల్లో సర్వర్లు డౌన్ కావడంతో పాస్ పోర్ట్ల జారీ విషయంలో ఇబ్బందులు తలెత్తినట్లు వారికి వివరించారు. జారీ చేయవలసిన పాస్‌పోర్ట్‌లను తిరిగి సెలవు ఉన్న రోజునే ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తామని అధికారులు చెప్పారు. కాగా... పాస్ పోర్టు కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నామని, నిత్యం ఇలా ఏదో ఓ కారణంతో పాస్ పోర్టును పొందలేకపోతున్నామని కొంతమంది దరఖాస్తులు చెబుతుండగా...ఇంకోసారైనా ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా చూడాలని మరికొంతమంది దరఖాస్తుదారులు తెలిపారు.