SOMU ON NTR HELATH UNIVERSITY :ఎన్టీఆర్ పేరు మార్పుతో హెల్త్ యూనివర్శీటి ఎమెండ్‌మెంట్ బిల్లును ప్రవేశపెట్టడం అంటే.. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మంటగలపడమేనని ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైద్య కళాశాలలను ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు ఎన్టీఆర్ పడిన తపన గుర్తు చేసుకోవలసిన అవసరం ఉందన్నారు. ఏపీ ప్రభుత్వం దురుద్దేశంతో కేవలం సింగిల్ లైన్‌తో ప్రతిపాదనను శాసనసభలో ప్రవేశపెట్టిందని ఆక్షేపించారు.
కుట్రపూరితంగా ఎన్టీఆర్‌కు ద్రోహం చేసేలా వైకాపా వ్యవహరిస్తోందన్నారు. నందమూరి తారక రామారావు పేరు కాదని.. వైఎస్సార్ పేరు ఎలా పెడతారని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి వైకాపాలోకి ఎప్పుడు వచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్‌ను కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటే.. వైకాపా మాత్రం ఆయన పేరును రాష్ట్రమంతా పెట్టేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి దీనిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ పేరు మార్పును భాజపా తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
BJP BHANU PRAKSAH : ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి పేరు మార్చడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని.. భాజపా నేత భానుప్రకాశ్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వానికి పేర్లపై ఉన్న శ్రద్ధ.. రాష్ట్ర అభివృద్ధిపై లేదని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణమే మార్చుకోవాలని డిమాండ్ చేశారు.
BJP KANNA : ఎన్నో ఏళ్లుగా ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటి పేరును మార్చడం దుర్మార్గం అని భాజపా నేత లక్ష్మీనారాయణ అన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా పేర్లు మారిస్తే ఎలా అని ప్రశ్నించారు.