ఎంతోమంది పోలీసులను హత మారుస్తూ, దేశంపై యుద్ధం ప్రకటిసున్న మావోయిస్టులకు మద్దతుగా పిల్ వేస్తారా...? అని ఏపీ హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. వారి చేతుల్లో చనిపోయిన పోలీసుల కోసం ఎవరైనా పిటిషన్లు వేశారా..? ఆ కుటుంబాలను ఎవరైనా పట్టించుకున్నారా...? అని ప్రశ్నించింది.మావోయిస్టుల కూంబింగ్ పేరుతో అమాయకులైన ఇద్దరు గిరిజనులను 2012 మే 10న పోలీసులు కాల్చిచంపారని, బాధ్యులైన వారిపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని కోరుతూ విశాఖ సివిల్ లిబర్టీస్ యూనియన్ అధ్యక్షుడు అక్బర్ 2012 జులైలో పిల్ వేశారు.
ఏ అర్హతతో వేశారు...?
ఈ వ్యాజ్యం మంగళవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. ప్రభుత్వ న్యాయవాది సుమన్ వాదనలు వినిపిస్తూ... పిటిషనర్ (పార్టీ ఇన్ పర్సన్) గతంలో మూడు అనుబంధ పిటిషన్లు దాఖలు చేశారన్నారు. ఓ అనుబంధ పిటిషన్లోని అభ్యర్ధనను సవరించాలని ధర్మాసనం పిటిషనర్ కు తెలిపిందన్నారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం .. 2012 లో దాఖలైన వ్యాజ్యంలో ప్రస్తుతం అనుబంధ పిటిషన్లు వేయడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. పిటిషనర్ ఏ అర్హతతో 'విశాఖ సివిల్ లిబర్టీస్ యూనియన్ పేరిట' వ్యాజ్యం దాఖలు చేశారని ప్రశ్నించింది.